కొవిడ్-19పై పోరు కోసం శాస్త్రవేత్తలు మానవ మేధస్సుతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ)నూ వాడుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి ఉపయోగపడే 200 ఔషధాలను ఏఐ సాయంతో బ్రిటన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారికి సమర్థ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు.
కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ వైరస్ వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కంప్యూటేషనల్ బయాలజీ, మెషీన్ లెర్నింగ్ సాధనాల సాయంతో ప్రొటీన్లపై పరిశోధన చేశారు. వీటిలో కరోనా ఇన్‌ఫెక్షన్‌తో ముడిపడిన వాటిని గుర్తించారు. "ఏఐ సాయంతో ప్రొటీన్ నెట్‌వర్క్‌పై పరిశీలన సాగించాం. ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అంశాలను పసిగట్టాం. తద్వారా కొవిడ్ చికిత్సకు పనికొచ్చే వీలున్న 200 ఔషధాలను గుర్తించాం" అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
ఇప్పటికే ఆమోదం పొందిన దాదాపు 2వేల ఔషధాలను విశ్లేషించి వీటిని గుర్తించారు. వీటిలో 40 మందులు కొవిడ్‌కు పనికొస్తాయని ఇప్పటికే గుర్తించి, వాటిపై క్లినికల్ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తమ ఏఐ సాధనాల సమర్థతకు ఇది నిదర్శనమని కేంబ్రిడ్జ్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఔషధాలతో లక్ష్యంగా చేసుకోవడానికి అనువుగా ఉన్న కొవిడ్ సంబంధ జీవ ప్రక్రియలను గుర్తించడానికీ ఇది వీలు కల్పించిందన్నారు.