తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2019, 11:41 AM IST

Updated : Oct 19, 2019, 1:38 PM IST

ETV Bharat / international

బ్రెగ్జిట్​ భవితవ్యాన్ని తేల్చనున్న చారిత్రక 'ఓటింగ్​'

ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్​ వైదొలిగేందుకు ఈయూతో కుదిరిన తాజా ఒప్పందంపై నేడు చారిత్రక ఓటింగ్​ జరగనుంది. విపక్షాలతో పాటు అధికార పార్టీలోని కొంత మంది ఎంపీల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో నూతన ఒప్పందానికి ఆమోదం లభిస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది.

బ్రిటన్​​ పార్లమెంట్​లో నేడు బ్రెగ్జిట్​ ఒప్పందంపై చారిత్రక ఓటింగ్

బ్రెగ్జిట్​ భవితవ్యాన్ని తేల్చనున్న చారిత్రక 'ఓటింగ్​'

బ్రిటన్​​ పార్లమెంట్​లో నేడు బ్రెగ్జిట్​ ఒప్పందంపై చారిత్రక ఓటింగ్​ జరగనుంది. ఐరోపా సమాఖ్యతో ప్రధాని బోరిస్​ జాన్సన్​ కుదుర్చుకున్న తాజా ఒప్పందంపై బ్రిటన్​ ఎంపీలు హౌస్​ ఆఫ్​ కామన్స్​లో ఓటింగ్​ నిర్వహించనున్నారు. అక్టోబర్​ 31లోపు ఈయూ నుంచి బ్రిటన్​ వైదొలుగుతుందా లేక మూడేళ్లుగా నెలకొన్న అనిశ్చితి కొనసాగుతుందా అనే అంశంపై స్పష్టత రానుంది.

ఈ ఓటింగ్​ కోసం బ్రిటన్​ పార్లమెంట్​ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనుంది. 1982 తర్వాత శనివారం రోజున బ్రిటన్​ పార్లమెంట్​ సమావేశం జరగడం ఇదే తొలిసారి.

విపక్ష పార్టీలతో పాటు ప్రధాని సొంత కూటమి పార్టీలు కొన్ని ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ పార్లమెంట్​లో ఎంపీల మద్దతు కూడగట్టేందుకు దాదాపు 48 గంటల పాటు శ్రమించింది జాన్సన్​ బృందం. 2016 నుంచి బ్రిటన్​ను రాజకీయ గందరగోళంలో పడేసిన బ్రెగ్జిట్​ ప్రక్రియకు తాను కుదుర్చుకున్న ఒప్పందం ఎంతో ఉత్తమమైందని పేర్కొన్నారు ప్రధాని.

బ్రెగ్జిట్​కు నిరసన సెగ...

ఐరోపా సమాఖ్య నుంచి వైదొలిగేందుకు చేసుకున్న తాజా ఒప్పందంపై ఈ రోజు సాయంత్రం 3:30 (భారతీయ కాలమానం ప్రకారం) గంటలకు చర్చ ప్రారంభం కానుంది. ఇప్పటికే బ్రెగ్జిట్​కు వ్యతిరేకంగా బ్రిటన్​ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. చారిత్రక ఓటింగ్​ నేపథ్యంలో ఒప్పందంపై ప్రజాభిప్రాయం చేపట్టాలనే డిమాండ్లతో ఆందోళనలు జరిగే అవకాశముంది.

ఒకవేళ ఆమోదం లభించకపోతే... బ్రెగ్జిట్​ను ఆలస్యం చేయడానికి చట్టం రూపొందించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా చట్టాన్ని రూపొందించింది ప్రభుత్వం. అయితే బ్రెగ్జిట్​ను వాయిదా వేయడం కన్నా చావడం మేలని బోరిస్​ అభిప్రాయపడ్డారు.

320 ఓట్లు అవసరం..

650 మంది ఉన్న హౌస్​ ఆఫ్​​ కామన్స్​లో అధికార కన్సర్వేటివ్​ పార్టీకి 288 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. మెజారిటీకి 320 ఓట్లు అవసరం. ఈ నేపథ్యంలో కొత్త ఒప్పందానికి బ్రిటీష్​ పార్లమెంట్​ ఆమోదం లభిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదీ చూడండి: కొత్త బ్రెగ్జిట్​ ఒప్పందంపై యూకే, ఈయూ అంగీకారం

Last Updated : Oct 19, 2019, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details