తెలంగాణ

telangana

ETV Bharat / international

మిస్టర్​ మేధావి: మెదడు పెరిగితే సరిపోదంట!

"మెదడు పెరిగితే సరిపోదు. పరిమాణం ఎంతున్నా సరే... తెలివి, బుద్ధి సరిగ్గా ఉండాలంటే అందులోని సర్క్యూట్లు చురుగ్గా ఉండాలి"... ఇది తాజా పరిశోధనల్లో తేలిన వాస్తవం.

By

Published : May 15, 2019, 7:42 PM IST

మిస్టర్​ మేధావి: మెదడు పెరిగితే సరిపోదంట!

మెదడు పెద్దగా ఉన్న వ్యక్తికి తెలివి ఎక్కువ ఉంటుందా? ఎలాంటి పనైనా సులువుగా చేయగలరా? పూర్తిగా ఔనని చెప్పలేం అంటున్నారు పరిశోధకులు. మెదడులోని నాడీవలయాలే మనిషి తెలివితేటల్ని నిర్ణయించడంలో కీలకమని చెబుతున్నారు. లండన్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం పరిశోధకుల నివేదిక ఆధారంగా ఈమేరకు పీఎన్​ఏఎస్​ జర్నల్​లో ఓ వ్యాసం ప్రచురితమైంది.

ఏంటీ నాడీవలయాలు...?

మెదడు... నాడీకణాల సమూహం. వీటి మధ్య సమాచార మార్పిడి ద్వారానే మెదడు పనిచేస్తుంది. ఈ సమాచార మార్పిడికి ఉపకరించే వ్యవస్థ... నాడీవలయం.
మెదడు పరిమాణం పెంచడం అంటే... అదనంగా నాడీకణాలను జోడించడమే. అప్పుడు వాటి మధ్య మరింత ఎక్కువ సమాచార మార్పిడి జరిగే అవకాశం ఉంటుంది. మెదడు చురుకుగా పనిచేసే వీలుంటుంది. అయితే... ఇలా నాడీవలయాన్ని విస్తరించడం వల్ల లాభనష్టాలు రెండూ ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

నేర్చుకోగల సామర్థ్యంపై...

మెదడు పరిమాణం పెరిగితే 'నేర్చుకోగల సామర్థ్యం' పెరుగుతుంది. నాడీ కణాల మధ్య సమాచారం వేగంగా, కచ్చితంగా ప్రవహించే వీలు ఉండడమే ఇందుకు కారణం.
అయితే... నాడీవలయం ఓ పరిమితికన్నా పెద్దదైతే ప్రతికూల ప్రభావం ఉంటుందని పరిశోధనలో తేలింది. నాడీకణాల మధ్య సమాచార మార్పిడిలో అంతర్గతంగా తలెత్తే గందరగోళం కారణంగా నేర్చుకోవడంపై, పనితీరుపై ప్రభావం పడుతుందని నిర్ధరణ అయింది.

"వాస్తవానికి మెదడు సర్క్యూట్లకు అదనపు అనుసంధానాలు జోడించడం వల్ల నేర్చుకునే సామర్థ్యం మెరుగు పడుతుందని మా పరిశోధన ద్వారా తేలింది. మెదడు పనితీరుకు కచ్చితంగా అవసరం కాకున్నా ఈ అదనపు అనుసంధానాలు కొత్త పనిని సులభంగా నేర్చుకోవడానికి దోహదం చేయగలవు. అయితే... సర్క్యూట్ పరిమాణం పెరిగినప్పుడు ప్రతి కొత్త మార్గమూ అది పంపే సంకేతానికి మరింత ధ్వనిని జతచేస్తే... నేర్చుకోవడంలో సాధించినదంతా చివరకు కోల్పోకతప్పదు. ఒక ప్రత్యేకమైన పని చేసేందుకు ఆదర్శమైన 'మెదడు సర్క్యూట్ సైజు' ఉంటుందని దీన్నిబట్టే మనం అర్థం చేసుకోవచ్చు."
-తిమోతీ ఓ లియరీ, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం ఆచార్యుడు

మెదడు పరిమాణంపై ఈ పరిశోధన 'ఆటిజం'కు కారణాలపై విస్తృత అధ్యయనానికి ఉపకరిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details