కరోనా వ్యాప్తిని అరికట్టడంలో బ్రిటన్ క్లిష్ట పరిస్థితు ఎదుర్కొంటుందని ఆ దేశ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అన్నారు. కొవిడ్ కారణంగా బుధవారం 71 మంది మృతిచెందగా మెుత్తం మృతుల సంఖ్య 42,143కు చేరింది. ఈ సందర్భంగా మహమ్మారి వ్యాప్తిని ఉద్దేశించి మాట్లాడిన జాన్సన్ పలు వ్యాఖ్యలు చేశారు.
ఒక్కరోజే 7,108 కేసులు
బుధవారం కొత్తగా 7,108 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 312 మంది వెంటిలెటర్‌పై ఉన్నారు. వైరస్ వ్యాప్తి మెుదలైనప్పటినుంచి ఇప్పటివరకు... ఈ వారంలోనే ఎక్కువ కేసులు నమోదవడం, మృతుల సంఖ్య పెరగడం వల్ల లాక్డౌన్ అంశాన్ని బోరిస్ జాన్సన్ లేవనెత్తారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే మరోసారి లాక్డౌన్ విధించేందుకైనా వెనకాడనని తేల్చిచెప్పారు. మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ తప్పించేందుకు కొన్ని విషయాల్లో త్యాగం చేసేందుకు సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కరోనా నుంచి యూకే బయటపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"ప్రభుత్వ ఆలోచన ఎందుకు ఉపయోగకరమో.. పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య స్పష్టం చేస్తోంది. ప్రజలంతా ఐకమత్యంతో, నమ్మకంతో ఉండాలి. బ్రిటన్ ప్రజలు కరోనాతో పోరాడి గెలవాలి. భారీ ప్రాణనష్టం సంభవిస్తుందని తెలిసినా.. కొంతమంది వ్యక్తులు ఈ పోరాటాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు. దాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. బ్రిటన్ ప్రజలు వైరస్‌పై పోరాడి గెలవాలి. ఈ విపత్తు నుంచి యూకే బయటపడుతుంది."