ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగిన నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్, యూకే హోమ్ కార్యదర్శి ప్రీతి పటేల్ కలిసి .. ఆ దేశానికి చెందిన వీసా, ఇమిగ్రేషన్ విధివిధానాలను ఖరారు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా నైపుణ్యం కలిగిన వారిని ఇక్కడ పని చేయటానికి ఆహ్వానించనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వ వర్గాలు తెలిపారు. ఈ చర్యల వల్ల దేశ ఆర్థిక, వృద్ధిరేటు మెరుగుపడటానికి ఎంత గానో దోహదపడుతుందని ప్రధాని భావిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా తరహా విధానం
ఆస్ట్రేలియా తరహా విధానాన్ని 2021 జనవరి 21 నుంచి అమలు చేయాలని ప్రధాని బోరిస్ నిర్ణయించారు. అందులో భాగంగా నైపుణ్యంలేని వారిని దేశంలోకి ప్రవేశించకుండా నిలిపివేయనున్నారు. ఏటా వచ్చే 90 వేలకు పైగా నైపుణ్యంలేని వారిని తగ్గించి.. వచ్చే ఏడాది నుంచి నైపుణ్యం ఉన్న 65 వేల మంది దేశానికి వచ్చేలా అనుమతి ఇవ్వనున్నట్లు యూకే హోం శాఖ కార్యాలయం తెలిపింది. అంతేకాకుండా వారి అర్హత ఆధారంగా జీతాలను నిర్ణయించాలని సూచించింది.