బ్రిటన్‌లో నూతన ప్రభుత్వం ఏర్పాటయింది. ప్రధానిగా బోరిస్ జాన్సన్ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవికి థెరిసా మే రాజీనామా చేసిన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బోరిస్‌కు బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 సూచించారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ పాలకవర్గం ప్రకటన చేసింది.
ప్రమాణ స్వీకారంలో భాగంగా ప్రజల సేవకు నిబద్ధుడినై ఉంటానని స్పష్టం చేశారు బోరిస్. సరికొత్త ఒప్పందంతో అక్టోబర్ 31న ఐరోపా సమాఖ్య నుంచి వైదొలుగుతామని ప్రకటించారు. బ్రిటిష్ మంత్రివర్గాన్ని కూడా పునర్ వ్యవస్థీకరించారు బోరిస్ జాన్సన్.
థెరిసా రాజీనామా..
బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్వీన్ ఎలిజబెత్-2కు సమర్పించారు. బోరిస్ జాన్సన్ కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైన తరువాత థెరిసా మే రాజీనామా చేశారు.