తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా గురించి వారికి ఇంకా తెలియదట! - french navy unaware about covid-19 pademic

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా గురించి ఎవరికైనా తెలియదంటే ఆశ్చర్యమే. నిరక్షరాస్యులకూ ఈ విషయంపై కాస్తో కూస్తో అవగాహన ఉంది. అయితే ఈ లోకంలో కరోనా సంగతి తెలియని వారూ ఉన్నారు. అసలు వైరస్ ఉద్భవించిన విషయమూ వారికి తెలియకపోవచ్చట.

french navy unaware about covid-19 pademic
ఫ్రాన్స్ నేవీ

By

Published : Apr 13, 2020, 1:42 PM IST

కొవిడ్-19 మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా వార్తలే.. ఏ నోరు విప్పినా వైరస్ ముచ్చట్లే. భూగోళమంతా చుట్టేసిన ఈ వైరస్​ గురించి తెలియనివారు ఉంటారంటే అతిశయోక్తి కాదు. కానీ ఇది నిజం. ఈ విషయం గురించి తెలియనివారు ఇంకా చాలా మంది ఉన్నారు. కరోనా వ్యాప్తి గురించి అటుంచితే.. అసలు ఇలాంటి వైరస్ ఒకటి ఉద్భవించిన విషయం కూడా వారికి తెలిసి ఉండకపోవచ్చట. వారు ఎవరై ఉండొచ్చని ఆలోచిస్తున్నారా? భూమికి సుదూరంగా ఉండే వ్యోమగాములే అని అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే.

ఎవరు వారు?

ఓ వైపు కరోనా ప్రపంచ పరిస్థితులను తలకిందులు చేస్తుంటే.. ఫ్రాన్స్​లో రక్షణ రంగానికి సంబంధించి కీలకమైన మిషన్లు కొనసాగుతూనే ఉన్నాయి. అత్యంత రహస్యంగా సాగే అణు నియంత్రణ కార్యక్రమాలను.. సముద్రగర్భంలో జలాంతర్గాముల ద్వారా నిర్వహిస్తున్నారు. అందులోని సిబ్బందికి ఇక్కడ ప్రబలిన భయంకర మహమ్మారి గురించి తెలియదంటే ఆశ్చర్యం కలగకమానదు. సాధారణంగానే సబ్​మెరైన్​లలో ఉన్న సిబ్బందికి విషాదకరమైన వార్తలను తెలియజేయరు. చేసే పని నుంచి దృష్టిమరలకుండా ఉంచడం సహా వారిలో స్థైర్యాన్ని దెబ్బతీయకుండా చూసేందుకు ఈ విధానం అవలంబిస్తారు. వారు తిరిగి వచ్చిన తర్వాతే అన్ని విషయాలను అధికారులు వివరిస్తారు.

" సముద్రంలో పనిచేస్తున్న వారికి ఈ వైరస్ గురించి తెలియదు. వారందరూ తమ మిషన్​ కోసం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. సభ్యులకే కాకుండా కమాండర్​కూ ఈ విషయం గురించి తెలుసని నేను అనుకోను."

-డామినోక్ సాల్లెస్, రిటైర్డ్ అడ్మిరల్

2003 నుంచి 2006 మధ్య ఫ్రెంచ్ బాలిస్టిక్ సబ్​మెరైన్​ స్క్వాడ్రన్​కు నేతృత్వం వహించిన సాల్లెస్... 2004 మాడ్రిడ్​ నగరంలో బాంబు పేలుడు సంభవించిన సమయంలోనూ జలాంతర్గాముల్లోని సిబ్బందికి ఎలాంటి సమాచారం అందించలేదు.

అత్యంత గోప్యం

సబ్​మెరైన్​లోని సిబ్బందికి ఏఏ అంశాలు తెలియజేశారు? ఏఏ అంశాలు తెలియజేయలేదన్న విషయాన్ని.. ఫ్రెంచ్ నౌకాదళం బయటకు తెలియనివ్వదు. అసలు ఈ జలాంతర్గాములు ఫ్రాన్స్​లో లాక్​డౌన్​ విధించే ముందే సముద్రంలోకి వెళ్లాయా అనే విషయం కూడా బయటకు పొక్కనివ్వదు.

'రక్షణ, గోప్యతపై తీవ్రమైన ప్రతిబంధకాలు ఉన్న నేపథ్యంలో సిబ్బందికి వైరస్ విషయాన్ని చెప్పారా? లేదా? అన్న విషయం బయటకు తెలియడం అసంభవం' అని ఫ్రెంచ్ నౌకాదళం ప్రతినిధి లెఫ్టినెంట్ కమాండర్ ఒలీవియర్ రిబార్డ్ మాటలను బట్టి చూస్తే.. సైన్యంలో ఎంత గోప్యత పాటిస్తారో అర్థమవుతోంది.

"సిబ్బందిపై ప్రభావం చూపే ప్రతి విషయాన్ని దాచే ఉంచుతాం. సబ్​మెరైన్​లో ఇంటర్నెట్, రేడియో, టీవీ అందుబాటులో ఉండవు. అందువల్లే ఈ విషయం బయటి మాధ్యమాల ద్వారా వారికి తెలిసే అవకాశం లేదు. కమాండర్​కు అందిన సమాచారమే సిబ్బందికి తెలుస్తుంది. సభ్యులకు తెలియకూడదనుకున్న విషయాల్ని కమాండర్ వేరు చేసి సమాచారం అందిస్తారు. అంతరిక్షంలో రేడియో, ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ సముద్ర గర్భంలో అలాంటి సదుపాయాలు ఉండవు."

- గాబ్రియేల్, నేవీ వైద్యుడు

ఫ్రెంచ్ బాలిస్టిక్ సబ్​మెరైన్ 'లే ట్రంఫెంట్​'లో నాలుగు సంవత్సరాల పాటు వైద్యుడిగా సేవలందించారు గాబ్రియేల్. 2012లో ఫ్రెంచ్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ తీవ్రవాదులు దాడి చేసిన సమయంలో.. ఈయన సముద్రంలోనే ఉన్నారు.

వారు వచ్చేనాటికి పరిస్థితేంటి?

ఫ్రెంచ్ సబ్​మెరైన్లు నిర్వహించే మిషన్లు సాధారణంగా 60 నుంచి 70 రోజుల పాటు ఉంటాయి. దాదాపు 110 మంది సిబ్బంది ఇందులో పాల్గొంటారు. ఉదాహరణకు ఫిబ్రవరిలో వెళ్లిన సబ్​మెరైన్​లు ఏప్రిల్ చివరినాటికి మళ్లీ తీరానికి చేరుకుంటాయి. వారు తిరిగి వచ్చే సమయానికి ప్రపంచం పూర్తిగా మారిపోయి ఉంటుంది.

మార్చి 1న ఇక్కడ కేవలం 130 కొవిడ్ కేసులు నమోదవగా... ఇద్దరు మరణించారు. కానీ నెలన్నరలో పరిస్థితి తలకిందులైపోయింది. వైరస్ కేసుల సంఖ్య లక్షా 32 వేలు దాటింది. 14 వేల మందికి పైగా మరణించారు.

తెలియకపోవడమే మేలు

ఒకవేళ కరోనా వైరస్​ సమాచారాన్ని అందించినా.. కుటుంబసభ్యుల మరణవార్తలు వారు తిరిగొచ్చే వరకు చెప్పే అవకాశం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు సాల్లెస్. ఈ విషయంలో ఈయనకు వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. సముద్రంలో 60 రోజుల మిషన్​లో ఉన్నప్పుడే తన తండ్రి మరణించారు. మిషన్​ నుంచి తిరిగివచ్చిన తర్వాతే ఆయనకు ఈ విషయం తెలియజేశారట అధికారులు. సంఘటన ఎంత తీవ్రమైనప్పటికీ ఇలాంటి విషయాలు తెలియకపోవడమే మంచిదని అంటున్నారు సాల్లెస్.

ABOUT THE AUTHOR

...view details