తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన

జర్మనీ రాజధాని బెర్లిన్​లో ఇంటి అద్దెల పెంపుపై ప్రజలు ఆందోళనలు చేపట్టారు. వేలమంది రోడ్లపై చేరి నిరసనలు తెలిపారు. ప్రైవేటు స్థిరాస్తి, నిర్మాణ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సామాన్యులకు అందని స్థాయిలో అద్దెల పెంపు ఉందని ఆరోపించారు.

By

Published : Apr 7, 2019, 9:04 AM IST

Updated : Apr 7, 2019, 9:24 AM IST

ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన

ఇంటి అద్దెల పెంపుపై బెర్లిన్​వాసుల ఆందోళన

ఇంటి అద్దెల పెరుగుదలపై జర్మనీ రాజధాని బెర్లిన్​లో నిరసనలు వెల్లువెత్తాయి. వేలమంది బెర్లిన్​వాసులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. అద్దెల పెంపునకు నిరసనగా నినాదాలు చేశారు. బెర్లిన్​లో ప్రైవేటు సంస్థల చేతిలోనే అపార్ట్​మెంట్లు ఉండటం అద్దెలు పెరిగిపోవడానికి కారణమని ఆరోపించారు.

1989లో బెర్లిన్​ సరిహద్దు గోడ కూలిపోయిన తరవాత నగరం ఆర్థికంగా వెనుకబడిన వారికి అనువైనదిగా, అతి తక్కువ అద్దెలు ఉన్న చోటుగా ఉండేది. ఆ సమయంలో బెర్లిన్​కు కళాకారులు, బొహిమియా దేశస్థుల ప్రవాహం పెరిగింది.

బెర్లిన్​కు ప్రభుత్వం తిరిగి వచ్చాక సాంకేతికరంగ, అంకుర పరిశ్రమలకు కేంద్రంగా మారి బెర్లిన్​కు ప్రజాధారణ పెరిగింది. 2004 నుంచి ఇక్కడి జనాభా 3.39 మిలియన్ల నుంచి 3.6 మిలియన్లకు పెరిగింది. అదే సమయంలో ఇంటి అద్దెలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. ఇతర జర్మనీ నగరాలు, ఐరోపా​ రాజధానుల్లో అద్దెలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇక్కడ భారీగా పెరిగాయి.

బెర్లిన్​లో 860 చదరపు అడుగుల అపార్ట్​మెంట్​ అద్దెకు తీసుకోవాలంటే 2018లో సగటు నెలవారీ ధర సుమారు వెయ్యి యూరోలుగా ఉంది.

"అద్దెలతో అధికంగా లాభపడుతున్న రాబందులపై పోరాటం చేసేందుకే నేను ఇక్కడకు వచ్చా. నిరంతరం అద్దెల పెరుగుదలను నివారించాలనుకుంటున్నా. ఒక బెర్లిన్​వాసిగా అద్దెల పెంపుపై మాట్లాడితే సరిపోతుంది. బెర్లిన్​లో జన్మించినందుకు నాకు ఆ హక్కు ఉంది." - మాలిస్​ రాయ్​ముండ్​, బెర్లిన్​ వాసి

నిరసనకారుల ప్రధాన లక్ష్యం బెర్లిన్​లో అతిపెద్ద స్థిరాస్తి, నిర్మాణ సంస్థ డ్యూయిష్ వోహ్నెన్. ఈ సంస్థకు ఇక్కడ 1,11,500 అపార్ట్​మెంట్లు ఉన్నాయి. వాటి మార్కెట్​ విలువ సుమారు 15.2 బిలియన్​ యూరోలు. బెర్లిన్​లో మొత్తం 2 లక్షల 43 వేల అపార్ట్​మెంట్లు ప్రైవేటు సంస్థల అధీనంలో ఉన్నాయి.

Last Updated : Apr 7, 2019, 9:24 AM IST

ABOUT THE AUTHOR

...view details