తెలంగాణ

telangana

ETV Bharat / international

మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు.. డ్రైవర్‌ షాక్‌లోకి - Metro Incident latest news

Belgium Metro Incident: ప్లాట్‌ఫాంపై ఉన్న మహిళను కదులుతున్న రైలు ముందుకి తోసేశాడు ఓ దుండగుడు. ఈ షాకింగ్ ఘటన బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో జరిగింది.

woman-pushed-in-front-of-train
మహిళను పట్టాలపైకి తోసేసిన యువకుడు

By

Published : Jan 18, 2022, 5:28 AM IST

Belgium Metro Incident: ఒళ్లు గగుర్పొడిచే ఘటన ఇది! బెల్జియంలోని మెట్రో స్టేషన్‌లో ఓ వ్యక్తి.. ప్లాట్‌ఫాంపై ఉన్న ఓ మహిళను కదులుతున్న రైలు ముందుకి ఒక్కసారిగా తోసేశాడు. అయితే, క్షణాల వ్యవధిలో మెట్రో డ్రైవర్‌ స్పందించి రైలును నిలిపేయడం వల్ల.. ఆమె ప్రాణాలతో బయటపడింది. దీంతో అక్కడున్నవారు ఊపిరి పీల్చుకొన్నారు. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లోని రోజియర్ మెట్రో స్టేషన్‌లో ఈ ఘటన కలకలం రేపింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఏం జరిగిందంటే..?

మహిళను రైలు ఎదుటకు నెట్టేయడానికి ముందు ఆ వ్యక్తి ప్లాట్‌ఫాంపై అటుఇటు తిరుగుతున్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. సరిగ్గా రైలు వస్తున్న సమయంలో ఒక్కసారిగా ఆమెను వెనుక నుంచి పట్టాలపైకి తోసేశాడు.

ఊహించని ఈ ఘటనతో ఆమె పట్టాలపై పడిపోగా.. మెట్రో డ్రైవర్‌ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ వేయడంతో రైలు క్షణాల్లో ఆగిపోయింది. తోటి ప్రయాణికులు హుటాహుటిన ఆమెను పైకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో మెట్రో డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించారు.. కానీ, ఆయన కూడా షాక్‌లో ఉన్నారని బ్రస్సెల్స్ ఇంటర్‌కమ్యూనల్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనంతరం మహిళ, మెట్రో డ్రైవర్.. ఇద్దరినీ వైద్యశాలకు తరలించారు.

మరోవైపు నిందితుడు వెంటనే అక్కడినుంచి తప్పించుకొన్నాడు. అయితే, అతన్ని వెంటనే మరో మెట్రో స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అతనిపై హత్యాయత్నం అభియోగాలు మోపినట్లు తెలిపారు. పోలీసులూ ఈ ఘటనపై విచారణ ప్రారంభించారని, అతని మానసిక పరిస్థితిని పరిశీలించనున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి:అగ్ని జ్వాలల్లోంచి అశ్వాలను దూకించే పండగ.. అందుకోసమేనటా?

ABOUT THE AUTHOR

...view details