ఆస్ట్రియా టైరల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తల్లికి అందే పింఛనుపై కన్నేసిన ఓ వ్యక్తి.. ఆమె మరణాంతరం ఏడాదిపాటు మృతదేహాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. అధికారులను మోసం చేస్తూ ఎప్పటికప్పుడు డబ్బులు వసూలు చేశాడు.
ఇంటి బేస్మెంట్లో...
టైరల్ రాష్ట్ర పోలీసులు.. ఇన్స్బ్రక్ ప్రాంతంలో గురువారం ఓ ఇంటికి వెళ్లారు. 89ఏళ్ల వృద్ధురాలు.. 2020 జూన్లో మరణించిందన్న అనుమానంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇంటి బేస్మెంట్లో వృద్ధురాలి మృతదేహం దొరికింది. వెంటనే ఆమె కొడుకును అరెస్ట్ చేశారు.
విచారణలో భాగంగా.. తల్లి మరణించిన అనంతరం.. ఆమెకు వచ్చే పింఛను, నర్సింగ్ అలవెన్స్ కోసం.. మృతదేహాన్ని బేస్మెంట్లో దాచిపెట్టినట్టు 66ఏళ్ల ఆ వ్యక్తి అంగీకరించాడు. ఇప్పటివరకు ఆ వ్యక్తికి.. 50వేల యూరోలు అందినట్టు తెలుస్తోంది. అతడికి తల్లి పింఛను మినహా మరే ఇతర ఆదాయం లేదని పోలీసులు తెలిపారు.