వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజే ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యారని బ్రిటన్‌లోని ఓ వార్తా పత్రిక వెల్లడించింది. లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందుతున్న సమయంలో తన న్యాయవాదులలో ఒకరైన స్టెల్లా మోరిస్‌తో ప్రేమలో పడ్డారని తెలిపింది. అసాంజే సంతానంగా చెబుతున్న రెండేళ్లు, ఏడాది వయసున్న ఇద్దరు అబ్బాయిల ఫొటోలను ప్రచురించింది ఆ పత్రిక.
విషయం వెలుగులోకి వచ్చిందిలా...
గూఢచర్యం ఆరోపణల ఎదుర్కొంటూ అమెరికాతో న్యాయపోరాటం చేస్తున్న అసాంజే దాదాపు దశాబ్దం పాటు లండన్‌లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఉన్నారు. కేసు విషయంలో తరచూ కలిసే దక్షిణాఫ్రికా సంతతి న్యాయవాది స్టెల్లా మోరిస్‌తో ప్రేమలో పడ్డారు. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
ఆ తర్వాత పోలీసులు అసాంజేను అరెస్టు చేసి... లండన్‌లోని బెల్మార్ష్ కారాగారానికి తరలించారు. ప్రస్తుతం కరోనా విజృంభణ దృష్ట్యా జైలులో అసాంజే ఉండడం శ్రేయస్కరం కాదని, బెయిల్ ఇవ్వాలని కోరుతూ స్టెల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇందుకోసం కోర్టుకు సమర్పించిన పత్రాల్లో తమ ప్రేమ వ్యవహారాన్ని, పిల్లల విషయాన్ని వెల్లడించారు.
ఇదీ చూడండి:అసాంజేకు జైలు శిక్ష విధించిన బ్రిటన్ కోర్టు