తెలంగాణ

telangana

ETV Bharat / international

లాక్​డౌన్​ సడలించిన దేశాల్లో భారీగా కొత్త కేసులు! - corona news

ఆర్థిక వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు పలు దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తున్నాయి. అమెరికా, ఇటలీ, రష్యా, స్పెయిన్​ వంటి అత్యధిక కేసులు నమోదైన దేశాలతో పాటు ఇతర దేశాలు పలు కార్యకలాపాలకు అనుమతులిస్తున్నాయి. అయితే.. జనాభా అత్యధికంగా ఉన్న దేశాల్లో కొత్త కేసులు సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఆంక్షలు సడలిస్తే.. రెండో దశ కరోనా మహమ్మారి విజృంభించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

As lockdowns ease, some countries report new infection peaks
లాక్​డౌన్​ సడలించిన దేశాల్లో భారీగా కొత్త కేసులు!

By

Published : May 4, 2020, 11:16 AM IST

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు లాక్​డౌన్​ ఆంక్షలను సడలిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. మరోవైపు.. అధిక జనాభా కలిగిన పలు దేశాల్లో కొత్త కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో భారత్​ కూడా ఉండటం గమనార్హం. ఆదివారం దేశంలో రికార్డు స్థాయిలో 2600 కొత్త కేసులు నమోదయ్యాయి.

లాక్​డౌన్​ ఆంక్షలు సడలించిన తర్వాత పరీక్షల సామర్థ్యాన్ని పెంచకపోతే.. కరోనా వ్యాప్తి విపరీతంగా పెరిగిపోతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. కానీ.. ఆర్థిక వ్యవస్థలు రికార్డు స్థాయిలో పతనమవుతున్నందున వ్యాపారాలను ప్రారంభించాలని ప్రభుత్వాలపై ఒత్తిడి పెరుగుతోంది.

రష్యాలో ఒక్క రోజులో నమోదైన కేసుల సంఖ్య తొలి సారి 10వేలు దాటింది. ఇటలీ జనాభాతో పోలిస్తే బ్రిటన్​లో జన సంఖ్య తక్కువైనప్పటికీ.. మరణాల సంఖ్యలో ఇటలీకి చేరువైంది యూకే. అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు వేల మంది ఈ వైరస్​ బారిన పడుతున్నారు. గత శనివారం సుమారు 1400 మంది ప్రాణాలు కోల్పోయారు.

చైనాలో..

చైనాలో ఆదివారం కేవలం రెండే కేసులు నమోదయ్యాయి. అంతర్గత ప్రయాణాలపై ఆంక్షలను సడలించి.. పర్యటక ప్రదేశాలను ప్రారంభించిన క్రమంలో యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 5 రోజుల సెలవు కావటం వల్ల సుమారు 10 లక్షల మంది బీజింగ్​ పార్కులను సందర్శించారు. షాంఘైలో 10 లక్షల మంది పర్యటించేందుకు అనుమతించారు.

ఇటలీలో..

ఆంక్షలు సడలించించేందుకు ఇటలీ తొలి అడుగు వేసింది. అయితే.. ఆదివారం ఒక్కరోజునే 174 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. పార్కులు, మైదానాలు సోమవారం తిరిగి తెరుచుకోనున్నాయి.

స్పెయిన్​లో..

స్పెయిన్​లో మార్చి 14 నుంచి దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఆంక్షలు సడలిస్తూ.. సోమవారం నుంచి ప్రజారవాణాకు అనుమతించింది ప్రభుత్వం. అయితే.. భౌతిక దూరం, మాస్కులు ధరించటం తప్పనిసరి చేసింది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.

మాలేసియాలో తెరుచుకున్న వాణిజ్య సముదాయాలు..

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ, కరోనా కట్టడిని సమన్వయం చేస్తూ సాగాలని మలేసియా ప్రధాని మహ్​యిద్దిన్​ యాసిన్​ ప్రభుత్వం సూచించింది. ఆంక్షలు సడలించించింది. ఈ క్రమంలో… పలు వ్యాపార విభాగాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే.. ఆకస్మికంగా ఆర్థిక కార్యకలాపాలకు అనుమతిస్తే కొత్త కేసులు పెరుగుతాయనే భయంతో.. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది. 13 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు ఆంక్షలు సడలించేందుకు నిరాకరించాయి. కొద్ది రోజులుగా కొత్త కేసుల సంఖ్యలో తగ్గుదల నమోదైనప్పటికీ.. ఆదివారం 227 కేసులు నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు దేశంలో 6,298 కేసులు నమోదవగా.. 105 మంది మరణించారు.

న్యూజిలాండ్​లో కొత్త కేసులు సున్నా!

న్యూజిలాండ్​లో వైరస్​ తగ్గుముఖం పట్టింది. సోమవారం ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా మహమ్మారి వెలుగు చూసినప్పటి నుంచి తొలిసారి కేసులు నమోదు కాలేదని తెలిపింది. నెల రోజులుగా లాక్​డౌన్​ కొనసాగుతున్న తరుణంలో గత వారం కొన్ని ఆంక్షలను సడలించారు. దేశంలో మొత్తం 1500 కేసులు నమోదు కాగా.. 20 మంది మరణించారు.

ABOUT THE AUTHOR

...view details