తెలంగాణ

telangana

ETV Bharat / international

భవిష్యత్​లో ప్రపంచానికి పురుగులే ఆహారం!

మనం తినే ఆహారంలో పురుగు పడితేనే దానిని పక్కన పెట్టేస్తాం. అలాంటిది భవిష్యత్తులో వాటినే ఆహారంగా తినాల్సి వస్తే..? ఆహార కొరతను తగ్గించేందుకు ఈ కీటకాలే మనకు ప్రత్యామ్నాయం అని సూచిస్తున్నారు నిపుణులు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎన్నో స్టార్టప్​లు పుట్టుకొస్తున్నాయి. కీటకాల ఉత్పత్తితో వివిధ రంగాల వంటలను ప్రవేశపెడుతున్నాయి.

By

Published : Jul 18, 2021, 8:06 AM IST

insects food for humans
భవిష్యత్​లో ప్రపంచానికి పురుగులే ఆహారం!

భవిష్యత్​లో ప్రపంచానికి పురుగులే ఆహారం!

రోజురోజుకూ పెరుగుతున్న ప్రపంచ జనాభాతో ఆహార ఉత్పత్తికి డిమాండ్​ పెరుగుతోంది. కానీ.. సరిపడా పంటలు పండటం లేదు. మాంసం లభించడం లేదు. ఫలితంగా భవిష్యత్తులో ఆహార కొరత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నారు. కీటకాలను ఆహారంలో భాగం చేయడం ద్వారా ఈ కొరతను తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు. బీఫ్, పోర్క్​ల కన్నా ఈ కీటకాల ద్వారా ఎక్కువ పోషకాలు అందుతాయని చెబుతున్నారు. ఇప్పటికే 130 దేశాల్లోని 200 కోట్ల మందికి ఆహారంలో కీటకాలు భాగమే.

కీటకాలు పోషకాలను అందిస్తాయన్న మాట అటుంచితే అసలు వీటిని తినేదెలా అని చాలా మందికి అనిపిస్తుంది. అయితే ఈ కీటకాలతో పిజ్జా, బర్గర్​ సహా వివిధ రకాల పాశ్చాత్య వంటలను తయారు చేస్తున్నారు బ్రిటన్​కు చెందిన టిజియానా ది కోస్టాం​జో. హారిజాన్​ ఇన్​సెక్ట్స్ పేరుతో ఎడిబుల్ ఇన్​సెక్ట్స్​ వ్యాపారం చేస్తున్న కోస్టాంజో.. కీటకాలతో తయారు చేసిన వివిధ రకాల ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.

ఈ ఉత్పత్తులు పోషకాలను ఇవ్వడమే కాక రుచిగా కూడా ఉంటాయని అంటున్నారు కోస్టాన్​జో.

"మా ఉత్పత్తుల్లో ప్రధానమైనది కీటకాల బర్గర్​. ఈ మీల్​వార్మ్​ బర్గర్​ తయారుచేయడం చాలా సులువు. అంతేకాదు.. ఇది రుచికరంగా కూడా ఉంటుంది. ఈ కీటకాలను ఎండపెట్టి పొడిగా చేస్తే.. ఆ పొడిని కేక్స్​, బ్రెడ్​, పాస్తాల తయారీకి కూడా ఉపయోగించొచ్చు. మేము వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నాము."

-టిజియానా ది కోస్టాన్​జో

డిమాండ్​ ఎక్కువే.. ​

ప్రపంచవ్యాప్తంగా ఈ ఎడిబుల్​ ఇన్​సెక్ట్​ మార్కెట్​కు ఏటా డిమాండ్​ పెరుగుతూ వస్తోందని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. 2030 నాటికి ఈ మార్కెట్​ విలువ 8 బిలియన్​ డాలర్లకు చేరుకుంటుందని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్​ బార్క్​లేస్​ అంచనా వేసింది. ఈ విలువ 2019లో 1 బిలియన్​ డాలర్ల కన్నా తక్కువే ఉండేదని తెలిపింది. 2030 నాటికి ఒక్క ఐరోపాలోనే.. కీటకాల ఉత్పత్తులు 2,60,000 మెట్రిక్​ టన్నులకు చేరుకుంటాయని బ్రసల్స్​కు చెందిన ఇంటర్నేషనల్​ ప్లాట్​ఫాం​ ఆఫ్​ ఇన్​సెక్ట్స్​ ఫర్​ ఫుడ్​ అండ్​ ఫీడ్​ పేర్కొంది. ప్రస్తుతం ఈ 500 మెట్రిక్​ టన్నులు ఉత్పత్తి అవుతున్నాయని చెప్తోంది.

పశువుల పెంపకంతో పోలిస్తే పురుగుల పెంపకానికి తక్కువ ఖర్చు అవుతుందని.. పెద్దగా స్థలం కూడా అవసరం లేదంటున్నారు నిపుణులు.

ఈ కీటకాల ఉత్పత్తులను అసలు ఆహారంగా పరిగణించని దేశాలు.. ఇప్పుడు వాటిని జంతువుల పెంపకంలో ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలోనే మిడతలు సహా పలు కీటకాలను ఆహార ఉత్పత్తులగా వినియోగించేందుకు ఐరోపా సమాఖ్య ఆమోదం తెలిపింది.

మరో రెండేళ్లలో ఆహార ఉత్పత్తుల్లో ఎన్నో మార్పులు వస్తాయన్నారు ప్రొటిక్స్​ సంస్థ సీఈఓ కీస్​ ఆర్ట్స్​. భవిష్యత్తులో ఈ కీటకాల ఉత్పత్తులు జంతు ఆహారంగా మాత్రమే పరిమితం కావని మనుషుల ఆహారంగా కూడా వాడుకలోకి వస్తాయని అశిస్తున్నారు.

"భవిష్యత్తులో ఈ ఉత్పత్తులకు కేవలం జంతు ఆహారంగానే కాకుండా మనిషి ఆహారంగా కూడా డిమాండ్​ పెరుగుతుంది. రుచి, పోషక పదార్థాలు ఎక్కువ ఉన్న ఆహార ఉత్పత్తులపై మనిషి దృష్టి సారించడమే ఇందుకు కారణం. రానున్న రెండేళ్లలో ఆహార రంగంలో కీటకాల ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయి."

-కీస్​ ఆర్ట్స్, ప్రొటిక్స్​ సీఈఓ

'టైం పడుతుంది'

ఈ కీటక ఉత్పత్తులకు డిమాండ్​ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నో స్టార్టప్​లు పుట్టుకొస్తున్నా.. ఇవి రోజూవారీ ఆహార పదార్థాల్లో భాగం అవడానికి కొంత సమయం పడుతుంది. రెస్టారెంట్ మెనూల్లో ఈ ఉత్పత్తులతో చేసిన వంటలు చోటుసంపాదించాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే అంటున్నారు నిపుణులు. కీటకాలను ఆహారంగా తీసుకోవడంపై ప్రస్తుతం భోజనప్రియులకు ఉన్న అభిప్రాయమే అందుకు కారణం అంటున్నారు.

ఇవీ చూడండి :తప్పిన భారీ ముప్పు- సౌర తుపాను ప్రభావం శూన్యం!

VIRAL: కరోనా సంక్షోభం.. అంతా 'శానిటైజర్​' మయం!

ABOUT THE AUTHOR

...view details