మంచి ఆర్ట్ వర్క్ చేసివ్వమని ఓ మ్యూజియం ఒక ఆర్టిస్ట్‌కు కొన్ని లక్షల రూపాయలు చేతికిస్తే.. అతడు ఆ డబ్బును తీసుకొని ఖాళీ కాన్వస్ ఫ్రేమ్‌లను పంపించాడు. అది చూసి మ్యూజియం నిర్వాహకులు కంగుతిన్నారు. ఈ ఘటన డెన్మార్క్‌లో గత నెలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
డెన్మార్క్‌లో ప్రముఖ చిత్రకారుడైన జెన్స్ హానింగ్ 2007లో 'ఎన్ యావరేజ్ ఆస్ట్రియన్ యాన్యూవల్ ఇన్‌కమ్' పేరుతో, 2010లో 'ఎన్ యావరేజ్ డానిష్ యాన్యువల్ ఇన్‌కమ్' పేరుతో నిజమైన కరెన్సీ నోట్లను ఉపయోగించి చిత్తరువులను రూపొందించాడు. అవి అప్పట్లో చాలా పాపులారిటీ సంపాదించుకున్నాయి. అయితే, తాజాగా ఆల్‌బర్గ్‌లోని కన్‌స్టెన్ మ్యూజియం ఆఫ్ మోడర్న్ ఆర్ట్ నిర్వాహకులు త్వరలో జరగబోయే ఓ ప్రదర్శన కోసం ఆ చిత్తరువులను మరోసారి రూపొందించమని హానింగ్‌ను కోరారు. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకొని 84వేల యూఎస్ డాలర్లు (రూ.63.19లక్షలు) అందజేశారు. ఆ డబ్బు మొత్తాన్ని చిత్రంలో ఉపయోగించి.. ప్రదర్శన ముగిసిన తర్వాత తిరిగి మ్యూజియానికే అప్పగించాలని ఒప్పందంలో రాసుకున్నారు.