ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రతాపం సహా జీవన విధానాలపై మార్పులను విశ్లేషించే వెబ్‌సైట్‌ను దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ ఆవిష్కరించింది. లాక్‌డౌన్‌కు ముందు ప్రజల జీవనం, లాక్డౌన్లో ఎలా మారిందనే విషయాలను ప్రస్తావించింది. ప్రముఖ నగరాల్లోని ప్రజలు జనవరి 13 నుంచి యాపిల్ మ్యాప్స్‌లో చేసిన నేవిగేషన్ రిక్వెస్టుల ఆధారంగా ఈ డేటాను రూపొందించింది.
ప్రజల కదలికలపై ప్రభుత్వాలకు సమాచారం అందించి కొవిడ్ వ్యాప్తిని నిరోధించడంలో సహాయ పడటమే ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశమని యాపిల్ స్పష్టం చేసింది.
ముందు చైనా తర్వాత ఐరోపా
నడక, ప్రయాణాలు సహా ప్రజా రవాణా ఉపయోగించుకోవడంలోనూ గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు యాపిల్ వెల్లడించింది. కరోనా వైరస్ ఉద్భవించిన చైనా సహా తొలినాళ్లలోనే ప్రభావం చూపించిన హాంకాంగ్, సియోల్ నగరాల్లో జనవరి ద్వితీయార్థం నాటికి 60 శాతం కదలికలు తగ్గినట్లు పేర్కొంది. అనంతరం కొద్ది వారాల్లో ఐరోపా, దక్షిణ అమెరికాలో వైరస్ విజృంభించడం వల్ల ఈ ప్రాంతాల్లో ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపినట్లు వెల్లడించింది.
ఇటలీలో 90 శాతం
ఓ దశలో కొవిడ్ విస్తృతికి కేంద్ర బిందువుగా మారిన ఇటలీలో పరిస్థితులు దుర్భరంగా మారిపోయినట్లు తెలిపింది యాపిల్. మార్చి తొలివారంలో రోమ్ నగరంలో 90 శాతానికిపైగా ప్రయాణాలు తగ్గినట్లు స్పష్టం చేసింది. అనంతరం రెండు వారాల వ్యవధిలో బ్రిటన్‌లోనూ 90 శాతం చలనాలు తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించింది.