కరోనా వైరస్‌కు టీకా కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆక్స్ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ వరకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది.
తమ పరిశోధకులు చేస్తోన్న క్లినికల్ ట్రయల్స్‌లో పురోగతి ఆధారంగా ఈ ప్రకటన చేసింది ఇంగ్లాండ్‌కు చెందిన జెన్నర్ ఇనిస్టిట్యూట్. సెప్టెంబర్ కల్లా కొన్ని లక్షల డోసులను సిద్ధం చేస్తామనే ఆశాభావం వ్యక్తం చేసింది.
6 వేల మందిపై ప్రయోగం..
ప్రపంచంలో చాలా సంస్థలు ఇంకా వ్యాక్సిన్ తయారీలో తొలిదశలోనే ఉన్నాయి. జెన్నర్ మాత్రం ఆరంభంలోనే అదరగొట్టిందని, ఇప్పటివరకు చేసిన ప్రయోగాల వల్ల మనుషులపై ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు.
ఫలితంగా మే చివరి వారంలో జెన్నర్ తయారు చేసిన టీకాను 6 వేల మందిపై ప్రయోగించనుంది ఈ సంస్థ. ఈ టీకా వారిపైనా ఫలితాన్ని ఇస్తుందని, అంతేకాకుండా ఎలాంటి హాని కలిగించదని విశ్వాసం వ్యక్తం చేశారు పరిశోధకులు . ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే భారీగా డోసులు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.
కోతులపై సత్ఫలితాలు..
మోంటానా జాతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో మార్చి నెలలో జెన్నర్ సంస్థ తయారు చేసిన టీకాలను తొలుత రీసస్ మకావ్ కోతులపై తక్కువ స్థాయిలో ప్రయోగించారు.