విల్లీ డాలీ... ఐర్లాండ్‌లో ఈ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే పెళ్లి సంబంధాలు కుదర్చటంలో ఈయనది అందె వేసిన చేయి. డాలీ తన 50ఏళ్ల కెరీర్లో 3వేలకు పైగా వివాహాలను ఎంతో సంప్రదాయబద్దంగా నిర్వహించారు. డేటింగ్ యాప్స్, చరవాణిలో చాటింగ్ ఎక్కువగా జరుగుతున్న ఈ రోజుల్లో... అనేక మంది తమ ప్రేమను వెతుక్కుంటూ ఈ పెళ్లిళ్ల పేరయ్య దగ్గరకు వెళ్తారు.
ప్రేమను వెతుక్కోవడానికి ఇక్కడకి వస్తూ ఉంటారు. తమతో పాటు ఎనలేనంత ప్రేమనూ తీసుకొస్తారు. ఆ ప్రేమను పంచుకోవడం కోసం ఒకరిని వెతుక్కుంటారు. ప్రేమ ఇవ్వడమే కాదు.. తిరిగి ఆ ప్రేమను పొందాలనుకుంటారు కూడా.
-విల్లీ డాలీ, పెళ్లిళ్ల పేరయ్య.
ఐర్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల సంప్రదాయాల ప్రకారం... ఆస్తులన్నీ కుమారులకే దక్కుతాయి. దీని వల్ల ఆ ప్రాంత అమ్మాయిలు యూకే, అమెరికా వంటి ఇతర దేశాల వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. ఫలితంగా అమ్మాయిల కొరత ఏర్పడింది.
డాలీ కుటుంబం 160 ఏళ్లుగా ఈ మ్యాచ్ మేకింగ్‌ను వృత్తిగా ఎంచుకుంది. వారసత్వంగా... వృత్తితో పాటు 'లక్కీ లవ్ బుక్' కూడా డాలి సొంతమైంది. ఈ పుస్తకంలో అతీంద్రియ శక్తులు ఉన్నాయని విశ్వసిస్తారు డాలీ. ఇందులో ఎవరి పేరైనా రాస్తే.. ఆరు నెలల్లోగా వారికి తగిన జోడీ దొరుకుతుందని నమ్ముతారు.