ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు పలు దేశాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ఇదే మార్గాన్ని చెక్ రిపబ్లిక్ దేశమూ అనుసరిస్తోంది. అయితే.. అక్కడ ఆంక్షల వల్ల వేల మంది నిరాశ్రయులయ్యారు. వారికి ఆశ్రయం కల్పించడానికి ఉన్న అన్నిరకాల అవకాశాలను ఉపయోగించుకుంటుంది ప్రభుత్వం. ఎక్కువ మంది ఉన్న కారణంగా వ్యభిచార గృహాల్లోనూ ఆశ్రయం కల్పించడానికి అక్కడి అధికారులు చర్యలు చేపట్టారు.
అత్యవసర ఆదేశాలతో ప్రేగ్ నగరంలోని వేశ్య గృహాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే నగరంలోని హోలెసోవిస్ మార్కెట్‌లోని షోపార్క్ పేరుతో ఉన్న వేశ్య గృహాన్ని అధికారులు సోమవారం పరిశీలించారు. భవనాన్ని అధికారులు ఉపయోగించుకుంటారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ విషయంపై కొన్ని రోజుల్లో తెలియజేస్తామని అధికారులు వెల్లడించినట్లు ఆ భవనం మేనేజర్ తెలిపారు.