విశ్వనగరం లండన్లో నిరాశ్రయుల బాధలను అర్థం చేసుకుంది అక్కడికి చెందిన ఓ సామాజిక సంస్థ. నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. ఇంకా రోడ్లపైన సామాన్యులు నివసించడం చూసి చలించిపోయింది. దీంతో సమస్యకు పరిష్కారంతో ముందుకొచ్చింది. 'డ్రైవింగ్ ఫర్ ఛేంజ్' పేరుతో ప్రాజెక్టు ప్రారంభించి.. రెండు బస్సులను కనీస అవసరాలు తీర్చుకునేందుకు అనువుగా తీర్చిదిద్దింది.
సాధారణ డబుల్ డెక్కర్ బస్సుల్లా కనిపించే ఇందులో.. స్నానం చేసేందుకు వీలుగా షవర్లు, కాఫీ యంత్రాలు ఏర్పాటు చేశారు. హెయిర్ కటింగ్ సదుపాయంతో పాటు.. బ్యాంకు ఖాతా తెరిచేందుకు సహకారం పొందే వీలుంటుంది. ఉచిత డెంటల్ సేవలూ అందుబాటులో ఉంటాయి. 'ఛేంజ్ ప్లీజ్' అనే సంస్థ ఈ ప్రాజెక్టు చేపట్టింది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు సీమాల్ ఎజెల్ ఈ ఆలోచనకు అంకురార్పణ చేశారు.
"ఈ బస్సులు పెద్దగా ఉంటాయి కాబట్టి.. అవసరమైన అన్ని సేవలందించేందుకు అనువుగా ఉంటాయి. ఈ డబుల్ డెక్కర్లను.. ఎక్కువగా అవసరం ఉన్నవారికి సేవలను నేరుగా అందించేందుకు సులభంగా తీసుకెళ్లవచ్చు. లండన్లో సాధారణంగా తిరిగే బస్సుల్లాగే ఉంటాయి కాబట్టి.. వీటిని ఉపయోగించుకునే వ్యక్తులు అసౌకర్యానికి గురి కారు."