తెలంగాణ

telangana

ETV Bharat / international

అత్యంత ఏటవాలు వీధి.. గిన్నిస్​ రికార్డులకెక్కింది! - నార్త్​వేల్స్

అది బ్రిటన్​ నార్త్​వేల్స్​లోని హార్లెక్ పట్టణం. ఇక్కడి ఫోర్డ్​ పెన్​ లెక్​ అనే వీధి ప్రజలు సంతోషంలో మునిగి తేలుతున్నారు. కారణం.. ఈ స్ట్రీట్​ ఇటీవలే ప్రపంచంలోని అత్యంత ఏటవాలైన వీధిగా గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు సంపాదించింది. ఈ గుర్తింపు వెనుక ఎందరో కృషి దాగుంది.

అత్యంత ఏటవాలు వీధి.. గిన్నిస్​ రికార్డులకెక్కింది!

By

Published : Jul 28, 2019, 5:33 AM IST

అత్యంత ఏటవాలు వీధి.. గిన్నిస్​ రికార్డులకెక్కింది!

ఫోర్డ్​ పెన్​ లెక్​... బ్రిటన్​ నార్త్​వేల్స్​ హార్లెక్​ నగరంలోని ఓ​ వీధి. అక్కడ నడవాలంటే.. సాహసించాల్సిందే. అందులోకి ప్రవేశించాలంటే నడకలో ప్రత్యేక నైపుణ్యం ఉండాలి. ఎందుకంటే రోడ్లు జారుడుబల్లను తలపిస్తాయి. ఏటవాలుగా ఉంటాయి. జారిపడితే పళ్లు రాలిపోవాల్సిందే. మనుషుల పరిస్థితే ఇలా ఉంటే.. మరి కార్లు, బైక్​లెలా వెళ్తాయని ఆలోచిస్తున్నారా..? అవీ అలాగే... అతి కష్టం మీద గమ్యస్థానాల్ని చేరతాయి. అందుకే గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్​ వాళ్లూ మెచ్చారీ రోడ్డును. అత్యంత ఏటవాలు వీధిగా ప్రపంచ రికార్డుల్లో చోటు కల్పించారు.

యూకే వేల్స్​ సముద్రతీరంలోని ఈ వీధి 37.45 శాతం ఏటవాలుగా ఉంటుంది. అందుకే రికార్డు సృష్టించింది. 330 మీటర్ల ఆ రోడ్డు చివరకు చేరే వరకు 50 మీటర్ల ఎత్తుకు చేరుకుంటారు.
ఇదివరకు ఈ ఘనత న్యూజిలాండ్​ దునెదిన్​లోని బాల్ద్విన్​ స్ట్రీట్​ పేరిట ఉండేది. దానితో పోలిస్తే హార్లెక్​ వీధి 2 శాతం ఎక్కువగా.. సుమారు 10 మీటర్ల పొడవునా ఏటవాలుగా ఉంది. ఈ వీధి గ్రేడియంట్​ 1:2.67గా ఉంది. అంటే సమాంతరంగా ప్రతి 2.67 మీటర్లు ప్రయాణించిన కొద్దీ... మీటరు ఎత్తు వాలు పెరుగుతుంది. అంటే చాలా నిటారుగా ఉంటుందన్నమాట.

అసలెలా గుర్తించారు...

స్థానిక వ్యక్తి.. గ్విన్​ హెడ్లీ ఓ రోజు కారులో వెళ్తుండగా మూలమలుపు వద్ద బ్రేక్​ వేసినప్పటికీ కారు అలాగే కిందకు వెళ్లిపోయింది. ఇంటికెళ్లాక ప్రపంచంలోని అత్యంత ఏటవాలు కలిగిన వీధి ఏమైనా ఉందా అని అంతర్జాలంతో శోధించాడు. అప్పుడు ఈ ఫోర్డ్​ పెన్​ లెక్​కు ఓ అవకాశమున్నట్లు గుర్తించి.. ఇరుగుపొరుగు వారితో ఒక బృందంగా ఏర్పడ్డారు. ఆ సమయంలో హార్లెక్​పై ఫేస్​బుక్​ గ్రూప్​ నడుపుతున్న సారా బాధమ్​ కూడా ఇందులో ఒకరు. ఈ కొలతలు గుర్తించడం, ఎత్తు, ఏటవాలు.. ఇవన్నీ సవాల్​గా తీసుకొని ఫలితం సాధించారు.

ప్రస్తుతం సారా బాధమ్​ గిన్నిస్​ బుక్​ ఆఫ్​ వరల్డ్​ రికార్డ్స్ ​బిడ్​ సహ-నిర్వాహకురాలు కావడం విశేషం. ఆమె ఇక్కడే పెరిగారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకుతెచ్చుకొని ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు. శీతాకాలంలో రోడ్లపై దొర్లిపడిన రోజుల్ని నెమరవేసుకున్నారు. రికార్డు వెనుక ఆమె కృషి ఎంతో ఉంది. అందరినీ సంప్రదించి.. వివరాలు సేకరించి.. ప్రపంచంలోనే అత్యంత ఏటవాలు కలిగిన వీధిగా గిన్నిస్​ రికార్డుల్లోకెక్కించారు.

''ప్రతి ఒక్కరూ మొదటినుంచి మద్దతుగా నిలిచారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఏటవాలు కలిగిన వీధిగా తొలుత నుంచి ప్రతి ఒక్కరూ భావించే ఉంటారు. కానీ.. హార్లెక్​ లాంటి చిన్ని వీధిని గుర్తిస్తారని అనుకొని ఉండరు. చంద్రునిపైన ఉన్న భావన కలుగుతుంది. నేను వ్యక్తిగతంగా ఎంత ఆనందంగా ఉన్నానో బయటకు వ్యక్తపరచలేను. ఇక్కనే పెరిగిన నాకు ఈ ప్రదేశం అంటే చాలా ఇష్టం.''

- సారా బాధమ్​, గిన్నిస్ బుక్​ ఆఫ్​ రికార్డ్స్ ​బిడ్​​ సహ నిర్వాహకురాలు

వారం క్రితమే ఫోర్డ్​ పెన్​ లెక్​​ వీధి ఈ ఘనత సాధించినట్లు వారు ప్రకటన చేశారు. ఒక్కసారిగా ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది.

''మేం వారం క్రితమే ఈ ప్రకటన చేశాం. వెంటనే నగరానికి పండుగ కళ వచ్చింది. స్థానికులు ఎంతో ఆనందంగా ఉన్నారు. అంతా ఒకేచోట గుమికూడుతున్నారు. పర్యటకుల తాకిడీ విపరీతంగా పెరిగింది. ఈ వీధిలో ఇంత మంది పాదచారులు, కార్లు వెళ్లింది నేనెప్పుడూ చూడలేదు.''

- జుడిత్​ స్టీవెన్స్​, హార్లెక్​ పర్యటకుల సంఘం

గిన్నిస్​ వరల్డ్​ రికార్డ్స్​లో చోటు అనంతరం ఈ వీధికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఇక్కడ ప్రత్యేక వేడుకలూ జరపాలని చూస్తున్నారు. ఈ అత్యంత ఎత్తైన ఏటవాలుగా ఉన్న వీధిపై ఆగస్టు 11న బ్రిటిష్​ సైక్లింగ్​ పోటీలు నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. టాప్​ సైక్లిస్ట్​ల రాకతో వీధి.. కొత్త కళ సంతరించుకోనుంది.

ఇదీ చూడండి: వరదలు: 120 మందిని రక్షించిన వాయుసేన

ABOUT THE AUTHOR

...view details