భారత్లో 86శాతం మంది.. రష్యా అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్-వీ' కొవిడ్ టీకాను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ సర్వే చెబుతోంది. బ్రిటన్కు చెందిన యుగోవ్ అనే.. మార్కెట్ రీసెర్చ్ అండ్ డేటా అనలిటిక్స్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి వ్యాక్సినేషన్ చేయించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలిపింది.
భారత్ సహా 11 దేశాల్లో ఈ సంస్థ సర్వే చేపట్టింది. బ్రెజిల్, ఈజిప్ట్, ఇండోనేసియా, మలేసియా, మెక్సికో, నైజీరియా, సౌదీ అరేబియా, ఫిలిప్పీన్స్, యూఏఈ, వియత్నాం దేశాల్లో సర్వే జరిగింది. అక్టోబర్ 9 నుంచి 15వ తేదీ మధ్య ఈ సర్వే చేపట్టారు. మొత్తం 12,000 మందిలో 73 శాతం మంది రష్యా టీకా తీసుకునేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు సర్వే ఫలితాలు చెబుతున్నాయి. వ్యాక్సిన్ విషయంలో మధ్య, దక్షిణాసియా దేశాలపై చేపట్టిన సర్వేల్లో ఇదే అతిపెద్దది.