కరోనా వైరస్.. ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న మహమ్మారి. రోజురోజుకు కేసులు, మరణాలు సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే తమ వద్ద ఏప్రిల్ నెలలో రోజుకు సగటున 80 వేల కేసులు రిపోర్టయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) టెడ్రోస్ అధనామ్ తెలిపారు. దక్షిణాసియా దేశాల్లో వైరస్ విజృంభిస్తుండగా.. పశ్చిమ ఐరోపాలో తగ్గుముఖం పట్టిందని పేర్కొన్నారు.
"ప్రస్తుతం 35 లక్షలకుపైగా కేసులున్నాయి. 2,50,000 మందికిపైగా మరణించారు. ఏప్రిల్ మొదటి నుంచి.. ప్రతి రోజు సగటున 80వేల కొత్త కేసులు డబ్ల్యూహెచ్ఓకు రిపోర్టయ్యాయి."
--- టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్ఓ డైరక్టర్
ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ప్రపంచ దేశాలకు పలు సూచనలు చేశారు. తమ భూభాగంలోకి వచ్చిన వైరస్ను నియంత్రించగలిగేలా సామర్థ్యాల్ని పెంచుకోవాలని నిర్దేశించారు. ఇక నుంచి 'సాధారణ పరిస్థితులు' ఎలా ఉంటాయో, వాటితో ఎలా సర్దుబాటు చేసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓవైపు కరోనాపై జరుగుతున్న పోరుకు మద్దతిస్తూనే.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్థిరమైన ఆరోగ్య వ్యవస్థ ఏర్పాటుకు పునాదులు వేయాలని పిలుపునిచ్చారు టెడ్రోస్.
పశ్చిమ ఐరోపాలో కేసులు తగ్గుతున్నాయని చెప్పి టెడ్రోస్.. తూర్పు ఐరోపా, ఆఫ్రికా, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో వైరస్ విజృంభిస్తోందని తెలిపారు. పరీక్షలు వేగవంతం చేయడం వల్ల కేసుల్లో పెరుగుదల కనపడుతున్నట్టు అభిప్రాయపడ్డారు. అందువల్ల ఏ ప్రాంతం ఈ పరిస్థితుల నుంచి మెరుగుపడుతోందో చెప్పడం కష్టమన్నారు.
ఇదీ చూడండి:-ఆంక్షల సడలింపుతో తెరుచుకున్న స్కూళ్లు!