బోస్నియా-హెర్జ్‌గోవినాలో కొత్త సంవత్సరం వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బోస్నియా నైరుతీ ప్రాంతంలో నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొంటున్న హాలిడే కాటేజ్‌లో విషవాయువు లీక్ అయిన ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక మీడియా కథనం ప్రకారం బోస్నియా రాజధాని సారాజేవోకి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోసుస్జే మున్సిపాలిటీ పరిధిలోని ట్రిబిస్టోవో గ్రామంలో ఈ ఘటన జరిగింది.
కొత్త సంవత్సర వేడుకల్లో అపశ్రుతి- 8 మంది మృతి - bosnia tragedy
బోస్నియాలో నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా దుర్ఘటన జరిగింది. ఓ హాలిడే కాటేజ్‌లో విషవాయువు లీకై 8 మంది మృతి చెందారు.
సుమారు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఘటనకు సంబంధించిన సమాచారం అందినట్లు స్థానిక పోలీస్ శాఖ అధికారి వెల్లడించారు. పోలీసు సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించగా 8 మంది మృతి మృతదేహాలను గుర్తించామని తెలిపారు. వీరిలో టీనేజర్లు, విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారంతా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు అక్కడ సమావేశమయినట్లు తమ ప్రాథమిక విచారణలో తెలిసిందని సదరు పోలీసు అధికారి తెలిపారు. గది ఉష్ణోగ్రతలను పెంచేందుకు ఉపయోగించే పవర్ జనరేటర్‌లోని కార్బన్ మోనాక్సైడ్ లీక్ అవడంతో వారంతా మృతి చెందినట్లు తెలిపారు.