కరోనా కట్టడికి ప్రస్తుతం మనం అనుసరిస్తున్న భౌతిక దూరం, క్వారంటైన్ నిబంధనల్ని దాదాపు 700 ఏళ్ల కిందటే పూర్వీకులు పాటించారు. అప్పట్లో ఐరోపా ఖండాన్ని ప్లేగు వ్యాధి అతలాకుతలం చేసింది. ఇటలీలో 1348లో ప్లేగు ప్రభావం మొదలైంది. వెనిస్, మిలన్ నగరాల అధికారులు ప్రజారోగ్య పరిరక్షణకు అత్యవసరంగా పలు నిబంధనల్ని విధించారు. జనం ఒకరికి ఒకరికి మధ్య భౌతికదూరం పాటించాలనేది దాని సారాంశం. వస్తువుల ఉపరితలాలపై అంటుకున్న వైరస్ మనుషులకు సోకుతోందని వైద్యులు ఆనాడే గుర్తించారు. అందుకే వ్యాపార కార్యకలాపాలు, ఉత్పత్తులు, వస్తువుల తరలింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు.
మొట్టమొదటి సారిగా...
అడ్రియాటిక్ సముద్రపు ఒడ్డున ఉన్న రగుస(ప్రస్తుతం దక్షిణ క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్) పట్టణంలో ప్రపంచంలోనే మొదటిసారిగా క్వారంటైన్‌ను తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. నౌకాశ్రయానికి వచ్చే అన్ని ఓడల్లోని వ్యాపారులు, సిబ్బందికి ఏమైనా వ్యాధులు ఉన్నాయేమోనని వైద్య సిబ్బంది పరీక్షించి, కొంతకాలం పట్టణానికి దూరంగా ఉంచేవారు. ‘ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారికి రగుసలో ప్రవేశించేందుకు అనుమతి లేదు. ఓ నెల పాటు తప్పనిసరిగా సమీపంలోని ఎమర్కన్ దీవిలో కానీ పట్టణానికి దూరంగా ఉన్న కావ్‌టట్ అనే ప్రదేశంలో కానీ గడపాలి’ అంటూ 1377, జులై 27న రగుస మేజర్ కౌన్సిల్ వెలువరించిన చట్టం ప్రతి ఇప్పటికీ డుబ్రోవ్నిక్ ఆర్కైవ్స్‌లో భద్రంగా ఉంది. క్వారంటైన్‌లో ఉండే వారి కోసం వెదురు గృహాల్ని నిర్మించారు.