కరోనా వైరస్ భయంతో ఇటలీ విలవిలలాడుతోంది. ముఖ్యంగా ఆ దేశంలోని జైళ్లు అస్తవ్యస్తంగా మారాయి. సహజంగానే రద్దీగా ఉండే జైళ్లు.. వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. కనీసం కుటుంబ సభ్యులను కలవలేని పరిస్థితి. ఈ చర్యలను తట్టుకోలేక కారాగారాల్లోని ఖైదీలు నిరసనలు చేపట్టారు. డజనుకుపైగా జైళ్లల్లో ఆందోళనలు సాగుతున్నాయి.
ఆరుగురు మృతి..
మోడేనాలోని ఓ జైలులో ఆరుగురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే కారాగారంలోని ఓ ఆరోగ్య కేంద్రంలోకి అక్రమంగా చొరబడి... మెథడోన్ (ఓపియాయిడ్)ను అధికంగా తీసుకోవడం వల్లే వీరు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.
మరోవైపు మిలాన్‌లోని శాన్ విట్టోర్ జైలులో కారాగార భవనం పైకి ఎక్కి ఆందోళనలు చేపట్టారు ఖైదీలు. 'క్షమాపణలు చెప్పాలి' అన్న పెయింటింగ్‌ను పట్టుకుని నినాదాలు చేశారు.