రష్యా ఆమోదం తెలిపిన 'స్పుత్నిక్- వీ' కరోనా వ్యాక్సిన్ మూడో దశ పరిశోధన మరో 7-10 రోజుల్లో ప్రారంభం కానుందని ఓ నివేదిక తెలిపింది. స్థానిక వార్తా సంస్థ ప్రకారం... గమలేయా శాస్త్రీయ పరిశోధనా సంస్థ చేపట్టే ఈ ప్రయోగం మాస్కో ప్రాంతంలో జరుగనుంది. ఇందులో వేలాది మంది వాలంటీర్లు పాల్గొననున్నారు.
"మా సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. కానీ, ప్రొటోకాల్ ప్రకారం అన్ని పరిశోధనలు పూర్తి చేయాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎలాంటి ఆలస్యం లేకుండా తదుపరి, చివరి ప్రయోగానికి అనుమతులిస్తుందని ఆశిస్తున్నాం. వారం, పది రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. "