దేశానికి 34 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి కావడం మామూలు విషయం కాదు. అదీ ఒక మహిళ. కానీ సనా మారిన్ ఆ ఘనత సాధించింది. ఒకటి కాదు రెండు కాదు.. ఐదు పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆమె నడపనుంది. ఇంత చిన్న వయసులో అంత పెద్ద బాధ్యతలు నిర్వహించడం అంత తేలిక కాదు. కానీ ఫిన్లాండ్ ప్రజలు ఆమెను నమ్మారు. కారణం.. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి ఆమె అంచలంచెలుగా ఎదిగిన వైనమే.
సనా మారిన్‌ది సాధారణ మద్యతరగతి కుటుంబం. చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి పెంపకంలోనే సనా పెరిగింది. తల్లి మరో మహిళతో సహజీవనం చేయడంతో బాల్యంలో సనా.. ముభావంగా ఉండేది. అంతగా స్నేహితులతో కలిసేది కాదు. అదే సమయంలో ఆమె ఎక్కడా కుంగిపోలేదు. చదువుతూనే పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసింది. ఆరంభంలో. స్థానిక బేకరీలో పని చేసింది. పదిహేనేళ్ల వయసులో వీధుల్లో మ్యాగజైనులు అమ్మింది. ఓ దుకాణంలో క్యాషియర్‌గా పని చేసింది. అలా పనిచేస్తూనే ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించింది.
రుణం తీర్చలేనేమోనని...
ఉన్నత విద్యాభ్యాసం కోసం రుణాలు తీసుకుంటారు. కానీ సనా అలా రుణం తీసుకోవడానికి భయపడింది. అందుకే టేంపేర్ విశ్వ విద్యాలయంలో అడ్మినిస్ట్రేటివ్ సైన్సెస్ డిగ్రీలో చేరడానికి ముందు తటపటాయించింది. కానీ తర్వాత ఓ సంస్థలో సేల్స్‌విమెన్‌గా పని చేసింది. అలా చేస్తూనే డిగ్రీ పూర్తి చేసింది.
అంచెలంచెలగా...
20 ఏళ్లకే మారిన్ విద్యార్థి ఉద్యమాల్లో ప్రవేశించింది. ఎన్నో సామాజిక ఉద్యమాల్లో పాల్గొంది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్(ఎస్‌డీపీ)లో చేరి.. ఆ పార్టీ తరఫున రెండు సార్లు టేంపేర్ సిటీ కౌన్సిలర్‌గా ఎన్నికైంది. 2015లో సనామారిన్ రాజకీయ జీవితం మరో మలుపు తిరిగింది. టేంపేర్ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా మారిన్‌ను ఎస్‌డీపీ పార్టీ ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఆమె 10,911 ఓట్ల మెజారిటీతో నెగ్గి పార్లమెంటులో అడుగు పెట్టింది. ప్రభుత్వంలో రవాణా, సమాచార మంత్రిగా బాధ్యతలు కూడా సమర్థంగా నిర్వహించింది. అందుకే నవంబరులో జరిగిన తపాలా సిబ్బంది సమ్మెకు అడ్డుకట్ట వేయడంలో విఫలమైన ప్రస్తుత ప్రధాని ఆటీ రెన్‌ను తొలగించాలని నిర్ణయించిన వెంటనే మారిన్‌నే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎస్‌డీపీ పార్టీ ప్రకటించింది.