ప్రాణాంతక కరోనా వైరస్‌తో ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతోంది. వైరస్ కేంద్రబిందువైన చైనాతో సహా ప్రపంచ దేశాల్లోని అనేక పట్టణాలు, కార్యాలయాలు, పార్కులు నిర్మానుష్యంగా మారాయి. బడికి వెళ్లి పాఠాలు నేర్చుకోవాల్సిన విద్యార్థులపైనా ఈ వైరస్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతపడుతుండటం వల్ల దాదాపు 300 మిలియన్లు(30కోట్లు) మంది విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారని యునెస్కో వెల్లడించింది.
కరోనాతో పోరుకు అనేక దేశాలు అసాధారణమైన చర్యలు చేపడుతున్నట్టు తెలిపింది యునెస్కో. కానీ వీటి ప్రభావం 290.5 మిలియన్ల మంది పిల్లలపై పడిందని పేర్కొంది.
పాఠశాలల మూసివేత జాబితాలో తాజాగా ఇటలీ, భారత్ చేరాయి. ఇరాన్, జపాన్‌తో పాటు అనేక దేశాల్లో ఇప్పటికే విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
ఇటలీని కరోనా కలవరపెడుతోంది. ఇప్పటివరకు 107మందిని బలితీసుకుంది. మరో 3వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాఠశాలలతో పాటు వర్సిటీలనూ మూసివేసింది ప్రభుత్వం. క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనొద్దని అభిమానులకు తేల్చిచెప్పింది.