జర్మనీలో భారీ వర్షాలు పెను విధ్వంసం సృష్టిస్తున్నాయి. వరదల ఉద్ధృతికి ఇప్పటికే 19 మంది మరణించగా.. వందలాది మంది ప్రజలు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు జన జీవనం స్తంభించిపోయింది. గల్లంతైన వారి కోసం ముమ్మరంగా సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఏకధాటిగా కురుసిన వానలకు కొండ చరియలు విరిగిపడి ఎక్కువ ప్రాణ నష్టం సంభవించిందని అధికారులు తెలిపారు.
వరదల ధాటికి ఇంటి ముందు పార్క్ చేసిన కార్లు కొట్టుకుపోయాయి. యూస్కిర్‌చెన్ కౌంటీలో 8 మంది మరణించారు. ఆ ప్రాంతంలో ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు కట్ అయ్యాయి. కొబ్లెంజ్ నగరంలో నలుగురు మృతిచెందారు. సుమారు 50 మంది ఇళ్ల పైకప్పులపై నిలబడి ప్రాణాలు రక్షించుకున్నారు. ఈ ప్రాంతాల్లో చాలా మంది గల్లంతైనట్లు తమకు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. అనేక గ్రామాల్లో కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. ఈ ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాలపై పూర్తిస్థాయి సమాచారం లేదని అధికారులు తెలిపారు.
ప్రమాదస్థాయిని మించి..
జర్మనీలోని చాలా నగరాలు, పట్టణాల్లో అధికారులు అత్యవసర పరిస్థితిని విధించారు. భారీ వరదల వల్ల పొరుగు దేశాలు కూడా ప్రభావితమయ్యాయి. కొలోన్‌లో నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండడం వల్ల దిగువన ఉన్న వందల గ్రామాలను ఖాళీ చేయించారు. అల్టెనా పట్టణంలో సహాయ చర్యల్లో పాల్గొన్న ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది చనిపోయారు. జర్మనీలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన నార్త్-రైన్ వెస్ట్ ఫాలియాలో రైళ్ల రాకపోకలు స్తంభించాయి. చాలా పట్టణాల్లో నదుల్లో నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాదాపు అన్ని ప్రధాన రహదారులు నీట మునిగాయని.. దక్షిణ, తూర్పు రైల్వే సేవలన్నీ నిలిపేశారని అధికారులు తెలిపారు.