ఐరోపాలో భారీ వర్షాలు విలయం సృష్టిస్తున్నాయి. జర్మనీ, బెల్జియంలో వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 110కి పెరిగింది. భారీ వర్ష బీభత్సానికి వందలాది మంది గల్లంతవగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
రెండు ప్రాంతాల్లోనే అధికంగా..
జర్మనీలోని రైన్లాండ్, పలాటినేట్ ప్రాంతాల్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అధికారులు స్పష్టం చేశారు. ఇక్కడ మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. నార్త్ రైన్- వెస్ట్ ఫాలియా రాష్ట్రంలో మృతుల సంఖ్య 43కు చేరినట్లు ఆ ప్రాంతంలోని అధికారులు తెలిపారు.
వరదల ధాటికి ఇంటి ముందు నిలిపి ఉంచిన కార్లు కాగితం పడవల్లా కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఫోన్, ఇంటర్నెట్ కనెక్షన్లు తెగిపోగా.. కొండచరియలు విరిగిపడి రాకపోకలు స్తంభించాయి. గల్లంతైన వారి కోసం భద్రతా దళాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే.. జర్మనీలో ఇప్పటివరకు 1300 మంది ఆచూకీ తెలియడం లేదని అధికారులు తెలిపారు.