కొవిడ్-19 బారినపడినవారిలో ఎక్కువ మంది 3 వారాల్లోనే కోలుకుంటున్నారు. నెల రోజుల లోపే వారికి కరోనా పరీక్షలో 'నెగెటివ్' వస్తుంది. బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తిలో కరోనా వైరస్ ఏకంగా 10 నెలలు తిష్ఠవేసింది. ఫలితంగా ఆయన ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అనేకసార్లు మరణం అంచుల్లోకి వెళ్లారు. ఆయన చనిపోయారనుకొని కుటుంబసభ్యులు ఐదుసార్లు అంతిమ సంస్కారాలకూ ఏర్పాట్లు చేశారు. ఇన్ని ఇబ్బందులు దాటుకొని ఆయన ఒక యాంటీబాడీ ఔషధం సాయంతో కోలుకొన్నారు. 310 రోజుల తర్వాత కరోనా నుంచి సంపూర్ణంగా విముక్తి పొందారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం పాటు ఆ వైరస్‌తో పోరాడిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఆయన పేరు డేవ్ స్మిత్ (72). బ్రిస్టల్‌లో డ్రైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా పనిచేసేవారు. ఆయనకు 'హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్' అనే సమస్య ఉంది. దీనివల్ల ఊపిరితిత్తుల కణజాలం ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతుంది. దీనికితోడు దీర్ఘకాల లింఫోసైటిక్ లుకేమియా కూడా ఆయనకు ఉంది.
2020, మేలో తొలిసారి..
ఇది నెమ్మదిగా వ్యాపించే క్యాన్సర్. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లపై పోరాడే సామర్థ్యం దెబ్బతింది. ఆయనకు గత ఏడాది మే నెలలో 'కరోనా పాజిటివ్'గా తేలింది. ఆ తర్వాత నెలల తరబడి కరోనా పడగ నీడలోనే జీవించారు. ఏడుసార్లు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. పీసీఆర్ పరీక్షల్లో 42సార్లు ఆయనకు పాజిటివ్ వచ్చింది. మొదట ఆసుపత్రిలో చేరాక వైద్యులు డేవ్‌కు యాంటీబయోటిక్స్ కోర్సు ఇచ్చి, ఇంటికి పంపేశారు. వ్యాధి తీవ్రం కావడంతో జులైలో డేవ్ మరోసారి ఆసుపత్రిలో చేరారు. అప్పుడు నిర్వహించిన పరీక్షలో ఆయనకు 'పాజిటివ్' వచ్చింది. ఆయనకు వ్యాధి తగ్గి, తిరగబెట్టి ఉంటుందని తొలుత వైద్యులు భావించారు. వైరస్ జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు, అతడిలో మునుపటి ఇన్‌ఫెక్షన్ కొనసాగుతున్నట్లు తేలింది. అక్టోబరులో బ్రిస్టల్ వర్సిటీ పరిశోధకులు డేవ్ నుంచి సేకరించిన నమూనాల్లోని వైరస్‌ను వృద్ధి చేయగలిగారు. దీన్నిబట్టి ఆయనలో ఉన్నది మృత కరోనా ఆర్‌ఎన్‌ఏ కాదని, సజీవ వైరస్సేనని వెల్లడైంది. ఆ తర్వాత అనేకసార్లు ఆయన ఆరోగ్యం విషమించింది.