Russia Ukraine War: ఉక్రెయిన్‌లోని రష్యా అనుకూలురు తీవ్ర అణచివేతకు గురవుతున్నారనే సాకుతో యుద్ధాన్ని ప్రారంభించిన పుతిన్ అసలు లక్ష్యం మాత్రం.. రష్యా సరిహద్దుల దాకా నాటో కూటమి విస్తరణ జరగకుండా నిలువరించడం. తొలుత ఉక్రెయిన్ చుట్టూ లక్షన్నరకు పైగా సైనికులను, భారీగా ఆయుధాలను మోహరించారు. ఉమ్మడి సైనిక విన్యాసాల పేరుతో- మరో పొరుగుదేశం బెలారస్‌లోకి కూడా యుద్ధ విమానాలను, ఆయుధాలను, సైనికులను పంపారు. అనంతరం ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాలైన దొనెట్స్క్, లుహాన్స్క్‌లను స్వతంత్ర రిపబ్లిక్‌లుగా గుర్తిస్తున్నట్టు ప్రకటించారు. ఆ ప్రాంతాల పరిరక్షణకు శాంతి సేనలను పంపుతున్నానని చెబుతూ.. గత నెల 24న ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగారు. తమ నగరాలపై హఠాత్తుగా వచ్చిపడుతున్న క్షిపణులతో హతాశుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ- బలమైన శత్రువును ఎదుర్కొనేందుకు ప్రజల్లో ధైర్యాన్ని నూరిపోశారు. తాను దేశం విడిచి పారిపోయేది లేదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం తమదేనని ప్రజలను ఉత్తేజపరిచారు.
పుతిన్ సేనలపై పోరాడేందుకు ముందుకువస్తే ఆయుధాలు ఇస్తామని ప్రకటించారు. ఇందుకు వేలమంది పౌరులు స్పందించారు. ఆయుధాలు చేతబూని యుద్ధానికి దిగారు. నెల రోజుల నుంచి రష్యా ఉక్రెయిన్‌లోని పలు వ్యూహాత్మక ప్రాంతాలపై క్షిపణులు, ఫిరంగులతో విరుచుకుపడి భీకర విధ్వంసం సృష్టిస్తోంది. రోజురోజుకూ దాడుల తీవ్రతను పెంచుతూ వస్తోంది. ఆఖరికి అత్యంత శక్తిమంతమైన హైపర్ సోనిక్ క్షిపణుల్నీ ప్రయోగిస్తోంది. ఈ ధాటికి ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలు నేలమట్టమవుతున్నాయి. అనేకమంది చనిపోతున్నారు. పౌరులు ప్రాణాలు అరచేతపట్టుకుని వలసపోతున్నారు. భారీగా సైనిక, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినా.. ఉక్రెయిన్ సేనలు మాత్రం మడమ తిప్పలేదు. ఎత్తిన తల దించలేదు. జెలెన్‌స్కీ వివిధ దేశాల చట్టసభలను ఉద్దేశించి మాట్లాడుతూ.. సహాయాన్ని అర్థిస్తున్నారు. ఆయన వినతికి స్పందించి- పాశ్చాత్యదేశాలు పెద్దఎత్తున ఆయుధాలు, మానవతా సాయాన్ని అందిస్తున్నాయి. ఇంకోవైపు మాస్కోతో చర్చలకు సిద్ధమనీ, నాటోలో చేరబోమనీ.. లుహాన్స్క్, దొనెట్స్క్‌ల స్వతంత్రతపై చర్చించేందుకు సిద్ధమనీ జెలెన్‌స్కీ సంకేతాలిచ్చారు.
చెమటోడ్చుతున్న రష్యా సేనలు..
ఉక్రెయిన్‌ను సులభంగానే చేజిక్కించుకోవచ్చని భావించిన రష్యా బలగాలకు.. జెలెన్‌స్కీ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పడం లేదు. వేలాదిగా తరలివచ్చిన రష్యా ట్యాంకర్లను ముందుకు కదలనీయకుండా ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు. దీంతో పుతిన్ సేనలు యుద్ధ రీతిని మార్చుకుంటూ.. ఉక్రెయిన్‌లోని అణువిద్యుత్కేంద్రాలు, ప్రభుత్వ భవనాలపై విరుచుకుపడుతున్నాయి. భీకర దాడులతో వణుకు పుట్టిస్తున్నాయి. అయినా ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయిలో పట్టుసాధించలేక చెమటోడుస్తున్నాయి. 64 కిలోమీటర్ల పొడవైన సైనిక కాన్వాయ్‌ను కీవ్ శివార్లకు తరలించినా, రాజధానిలోకి చొచ్చుకు వెళ్లడం కుదరలేదు. మాస్కో సేనలు ఇప్పటికీ కీవ్‌కు వాయువ్యంగా 15 కి.మీ. దూరంలో, తూర్పున 30 కి.మీ. దూరంలో నిలిచిపోయాయి. సాధారణ రోజుల్లో గంట సమయం కూడా పట్టని ఈ ప్రయాణాన్ని.. పుతిన్ బలగాలు నాలుగు వారాలైనా పూర్తిచేయలేకపోయాయి. దీన్ని ఉక్రెయిన్ విజయంగా యుద్ధ నిపుణులు అభివర్ణిస్తున్నారు.
నెల రోజులు.. మిగిలింది విధ్వంసం
ఉక్రెయిన్‌పై నెల రోజుల కిందట సైనిక చర్యను ఆరంభించిన రష్యా.. ఇప్పటికీ దాడులను కొనసాగిస్తూనే ఉంది. అయినప్పటికీ ఉక్రెయిన్‌పై నేటికీ పట్టు సాధించలేదు.
యుద్ధం ఆరంభం: ఫిబ్రవరి 24
ఉక్రెయిన్‌ను వీడిన వారు: 35 లక్షలు
దేశంలోనే చెల్లాచెదురైన వారు:65 లక్షలు
ఇళ్లు విడిచి వెళ్లిపోయినవారు: కోటి మంది
ఉక్రెయిన్‌కు నష్టం..
మొత్తం నష్టం:సుమారు రూ. 8.42 లక్షల కోట్లు(110 బిలియన్ డాలర్లు)
మరణాలు: 691 మంది పౌరులు. గాయపడిన వారు: 1,143 మంది (ఐరాస లెక్కల ప్రకారం.)
యుద్ధంలో రష్యాకు నష్టం ఇలా..
(ఉక్రెయిన్ రక్షణశాఖ వివరాల ప్రకారం)..
మరణాలు: సైనికులు:15,000, (రష్యా లెక్కల ప్రకారం 500)