మయన్మార్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్న క్రమంలో ఆ దేశ సైన్యం ఆధ్వర్యంలోని ఖాతాలపై సామాజిక మాధ్యమ వేదికలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఫేస్బుక్ మిలిటరీ పేజీలను తొలగించగా.. ఆ జాబితాలో యూట్యూబ్ చేరింది. సైన్యానికి చెందిన 5 ఛానళ్లను తొలగించింది. తమ మార్గదర్శకాలు, నిబంధనలను అతిక్రమించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
"మ్యావాడీ మీడియా, ఎంఆర్‌టీవీ, డబ్ల్యూడీ ఆన్లైన్ బ్రాడ్‌కాస్టింగ్, ఎండబ్ల్యూడీ వెరైటీ, ఎండబ్ల్యూడీ మయన్మార్‌కు చెందిన మీడియా ఛానళ్లను రద్దు చేశాం. మా మార్గదర్శకాలు, చట్టాలను అనుసరించి ఇతర ఛానళ్లు, వీడియోలనూ తొలగించాం. నిబంధనలు అతిక్రమించే ఛానళ్లను నిశితంగా పరిశీలిస్తున్నాం. "
- యూట్యూబ్
20 ఛానళ్లు, 160 వీడియోలు..
సైన్యానికి చెందిన 5 ఛానళ్లు సహా మొత్తం 20 ఛానళ్లపై వేటు వేసినట్లు తెలిపింది యూట్యూబ్. కొద్ది నెలలుగా రెచ్చగొట్టే ప్రసంగాలు, వేధింపులు, స్పామ్, హింసాత్మక సమాచారం వంటి తమ విధాన నిబంధనలు అతిక్రమించిన 160 వీడియోలనూ తొలగించినట్లు వెల్లడించింది.
గత ఏడాది డిసెంబర్లో 34 ఛానళ్లను తొలగించింది యూట్యూబ్. అందులో మయన్మార్ ఎన్నికలు, అమెరికా, చైనా, మలేసియాలల్లో ప్రాంతీయ ఘర్షణలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తేలటం వల్ల ఆ నిర్ణయం తీసుకుంది.
మయన్మార్ పరిస్థితులు ఆందోళనకరం: అమెరికా
మయన్మార్‌లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని పేర్కొంది అమెరికా. పరిస్థితులు చక్కదిద్దేందుకు ఆ ప్రాంతంలోని తమ భాగస్వామ్య దేశాలతో అధ్యక్షుడు బైడెన్ పరిపాలన విభాగం కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది. ఆంక్షలు విధించడం ద్వారా.. మయన్మార్‌లో సైనిక తిరుగుబాటు ఆమోదయోగ్యం కాదనే స్పష్టమైన సందేశాన్ని బైడెన్ పంపారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్ సాకి వివరించారు. గురువారం రోజున మయన్మార్ సైన్యం కాల్పుల్లో దాదాపు 24 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వచ్చిన వార్తలతో దిగ్భ్రాంతికి గురైనట్లు అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. సైన్యం అవలంభిస్తున్న హింసాత్మక ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:నిరసనకారులపై పోలీసుల కాల్పులు- 33 మంది మృతి!