యోగా నేపాల్‌లోనే పుట్టిందంటూ మరో కొత్తవాదనను తెరపైకి తీసుకొచ్చారు ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ (K.P. Sharma Oli). యోగా ప్రపంచానికి పరిచయమైనప్పుడు అసలు భారత్ అనే దేశమే లేదని పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని(International Yoga Day) పురస్కరించుకొని సోమవారం తన అధికారిక నివాసం బలువతార్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఓలీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
యోగాను కనుగొన్న తమ రుషుల గొప్పతన్నాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఓలీ పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఆ విషయంలో సఫలమయ్యారని తెలిపారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా(International Yoga Day) గుర్తించాలంటూ ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో మోదీ ప్రతిపాదనతో యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. కేపీ శర్మ ఓలీ గతంలో రాముడి జన్మస్థానమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.