ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఆధారపడుతున్న అమెరికా దిక్సూచీ వ్యవస్థ(నావిగేషన్ సిస్టం) గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ(జీపీఎస్)కు పోటీగా చైనా తయారు చేస్తున్న బెయ్‌డో నావిగేషన్ సిస్టం ప్రాజెక్టు పూర్తయినట్లు ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారికంగా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం 'గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్'లో జరిగిన కార్యక్రమంలో నూతన నావిగేషన్ వ్యవస్థను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
అమెరికాకు చైనా షాక్- సొంత దిక్సూచీ వ్యవస్థ సిద్ధం! - గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ
చైనా తయారు చేస్తున్న బెయ్‌డో నావిగేషన్ సిస్టం ప్రాజెక్టు పూర్తయినట్లు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రకటించారు. అమెరికా దిక్సూచీ వ్యవస్థ జీపీఎస్‌కు పోటీగా చైనా దీనిని రూపొందించింది. అయితే ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా చివరి ఉపగ్రహాన్ని జూన్ 23న చైనా ప్రయోగించింది. దీంతో ప్రాజెక్టు పూర్తి ఆపరేషన్‌కి కావాల్సిన 35 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. అమెరికాకు చెందిన జీపీఎస్, రష్యా గ్లోనాస్, యూరప్ గెలిలీయో నావిగేషన్ వ్యవస్థల కంటే ఇది అత్యాధునికమైనదిగా చైనా పేర్కొంది. ప్రస్తుత వ్యవస్థ 2035 నాటికి మరింత ఆధునికత, సమగ్రతను సంతరించుకొని ప్రపంచానికి అత్యాధునిక సేవలు అందించనున్నట్లు తెలిపింది.
అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టు పూర్తయినట్లు ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నావిగేషన్ వ్యవస్థతో 'బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్'’లో భాగమైన దేశాలకూ అత్యాధునిక సేవలు అందనున్నాయి.