తైవాన్ను తమ దేశంలో అంతర్భాగం (Taiwan Reunification) చేసుకునే విషయంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping news) కీలక వ్యాఖ్యలు చేశారు. తైవాన్ సమస్య త్వరలో పరిష్కారమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో విదేశీ జోక్యాన్ని సహించేది లేదని తేల్చిచెప్పారు.
చైనాలో నియంతృత్వానికి చరమగీతం పాడిన ఉద్యమానికి 110 ఏళ్లు నిండిన సందర్భంగా బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్స్‌లో ఏర్పాటు చేసిన సభలో జిన్‌పింగ్ మాట్లాడారు. తైవాన్ను అంతర్భాగం చేసుకోవడానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి ఆ దేశ స్వతంత్ర సైన్యమే అని అన్నారు.
"చైనా బలహీనత, దేశంలోని గందరగోళ పరిస్థితుల వల్ల తైవాన్ ప్రశ్న (China Taiwan conflict) ఉద్భవించింది. చైనా పునరుజ్జీవంతో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. చైనాలోని ప్రజలందరి సంకల్పం ఇదే. తైవాన్ సమస్య పూర్తిగా చైనా అంతర్గత విషయం. బయటి వ్యక్తులకు దీనిలో జోక్యం చేసుకునే అవసరం లేదు. చైనా జాతీయ పునరేకీకరణ సంకల్పం తప్పక నెరవేరుతుంది. శాంతియుతంగా ఈ ప్రక్రియ జరిగితే చైనాతో పాటు తైవాన్‌కు ప్రయోజనం ఉంటుంది. తైవాన్ దేశస్థులు సరైన చరిత్రను ఎంచుకొని.. చైనా ఏకీకరణలో భాగం కావాలి. తమ మూలాలు మర్చిపోయి, స్వదేశానికి వెన్నుపోటు పొడిచి, చైనాను విడగొట్టాలనుకునే వారికి మంచి ముగింపు ఉండదు. అలాంటి శక్తులను (తైవాన్ స్వతంత్ర ఉద్యమకారులు) ప్రజలు, చరిత్ర తిరస్కరిస్తాయి."
-జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు