టిబెట్ పర్యటనలో భాగంగా రాజధాని లాసాలో.. సైనిక ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్. టిబెట్ శ్రేయస్సు, శాశ్వత స్థిరత్వానికి ప్రాముఖ్యత ఇవ్వాలని ఆయన నొక్కిచెప్పినట్లు చైనా అధికారిక మీడియో వెల్లిడించింది. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని న్యింగ్చీ సహా వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాన్ని సందర్శించిన మరుసటి రోజునే సైనికాధికారులతో భేటీ కావటం ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత సరిహద్దుల్లో పహారా కాస్తున్న పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్ మిలిటరీ కమాండ్ ఉన్నతాధికారులకు జిన్పింగ్ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సైనికులకు శిక్షణ, యుద్ధ సన్నాహాలను బలోపేతం చేయాలని సూచించినట్లు గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
"టిబెట్లో మోహరించిన బలగాల ప్రతినిధులతో జిన్పింగ్ సమావేశమయ్యారు. మిలిటరీ శిక్షణ, అన్ని విధాలుగా యుద్ధ సన్నద్ధను బలోపేతం చేసే ప్రయత్నాలను ముమ్మరం చేయాలని సూచించారు. టిబెట్ అభివృద్ధి, శ్రేయస్సు, స్థిరత్వం కోసం కృషి చేయాలని ఆదేశించారు."