Xi Jinping on Ukraine crisis: ఉక్రెయిన్‌లోని పరిణామాలు ఎవరికీ ప్రయోజనం కలిగించవని పేర్కొన్నారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. ఉక్రెయిన్ సంక్షోభాన్ని తాము కోరుకోవటం లేదని స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి, సామరస్యం కోసం అంతర్జాతీయ బాధ్యతలను అమెరికా- చైనాలు భుజానికెత్తుకోవాలని సూచించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు జిన్‌పింగ్.
ఉక్రెయిన్‌పై రష్యా దాడులను చైనా ఖండించటం లేదని, మాస్కోతో సత్సంబంధాల కారణంగానే డ్రాగన్ మౌనంగా ఉండిపోతోందని అమెరికా విమర్శలు చేస్తున్న క్రమంలో బైడెన్‌తో జిన్‌పింగ్ మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది.
"ప్రపంచ శాంతి, అభివృద్ధి తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ప్రపంచం సామరస్యంగానూ, స్థిరంగానూ లేదు. మేము కోరుకుంటున్నది ఉక్రెయిన్ సంక్షోభం కాదు. దేశాలు రణరంగంలోకి రాకూడదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఘర్షణలను ఎవరూ కోరుకోరు. శాంతి, భద్రతల కోసమే అంతర్జాతీయ సమాజం ఎక్కవగా ఖర్చు చేయాలి. ఐరాస భద్రత మండలిలో శాశ్వత సభ్యులుగా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఇరు దేశాల సంబంధాలు సరైన మార్గంలో పయనించేలా చూడాలి ."
- షీ జిన్‌పింగ్, చైనా అధ్యక్షుడు.
అయితే, ఉక్రెయిన్ సంక్షోభానికి తెర దించేందుకు ఏదైనా సంయుక్త ఆపరేషన్ చేపట్టాలని జిన్‌పింగ్ కోరారా? అనే దానిపై స్పష్టత లేదు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివన్, చైనా దౌత్యవేత్త యాంగ్ జిచిల మధ్య గత సోమవారం రోమ్‌లో సమావేశం అనంతరం ఇరుదేశాల అధ్యక్షులు భేటీ అయ్యారు.