చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్కు చేరుకున్నారు. చారిత్రకమైన ఈ పర్యటనలో ఇరుదేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ కోసం కిమ్ జోంగ్ ఉన్‌తో చర్చించనున్నారు జిన్‌పింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సవాళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఇరువురు నేతలు భేటీ కావడం గమనార్హం.
ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో చైనా-ఉత్తర కొరియా మిత్రదేశాలుగా ఉన్నాయి. తరువాత ప్యాంగ్యాంగ్ అణుకార్యక్రమాలపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. ఐరాస ఆంక్షలను సమర్థించిన చైనా... మిత్రదేశం ఉత్తరకొరియాకు దూరమైంది. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియాలో 14 ఏళ్ల తరువాత చైనా అధ్యక్షుడి పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.