తెలంగాణ

telangana

By

Published : Apr 1, 2020, 9:57 AM IST

ETV Bharat / international

వుహాన్​లో సాధారణ స్థితి- జోరుగా నూడుల్స్​ వ్యాపారం

తీవ్రమైన కరోనా ప్రభావాన్ని ఎదుర్కొన్న చైనా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మార్కెట్లు, దుకాణాలు తెరచుకుంటున్నాయి. చైనీయులు ఇష్టంగా తినే నూడుల్స్​ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సామాజిక దూరం పాటించే విషయంలో పలు చోట్ల కఠిన ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు ఆర్థిక రంగం కోలుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

china
చైనా

కరోనా పుట్టినిల్లు 'వుహాన్​'లో సాధారణ పరిస్థితులు!

దాదాపు మూడు నెలల పాటు కరోనా వైరస్ కల్లోలాన్ని ఎదుర్కొన్న చైనాలోని హుబె రాష్ట్రం​లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సుదీర్ఘంగా వెంటాడిన మృత్యు పాశాన్ని విజయవంతంగా జయించిన వుహాన్ వాసులు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండు నెలలకు పైగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. నిర్బంధం నుంచి విడుదలై స్వేచ్ఛావాయువులు ఆస్వాదిస్తున్నారు.

కొందరు మాత్రం ఈ లోకాన్ని వదిలిపోయిన తమ ప్రియమైన వారి జ్ఞాపకాలను తల్చుకుంటూ కుమిలిపోతున్నారు. కరోనాకు బలైన తమ సన్నిహితులకు నివాళులు అర్పించేందుకు స్మశానాలకు తరలివెళ్తున్నారు. మృతులకు సమాధులు నిర్మించేందుకు అధికారులు అనుమతించారు. ఈ నేపథ్యంలో పలువురు తమ కుటుంబ సభ్యులకు సంప్రదాయ పద్ధతుల్లో అంతిమసంస్కారాలు నిర్వహించుకున్నారు. మరోవైపు కరోనాను నివారించడానికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. స్మశానాలకు వచ్చే వారిపై యాంటీ ఇన్ఫెక్షన్​ స్ప్రేలు చల్లుతున్నారు.

అందుబాటులోకి నూడుల్స్

వుహాన్​ నగరంలోని దుకాణాలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యజమానులు సైతం పలు జాగ్రత్తలు వహిస్తున్నారు. ఒకరినొకరి మధ్య 1.5 మీటర్ల దూరం ఉండేలా చూసుకుంటున్నారు. నగరంలో ఆహార పదార్థాల దుకాణాలు అందుబాటులోకి వచ్చాయి.

చైనీయులు అమితంగా ఇష్టపడే నూడుల్స్​ అక్కడి మార్కెట్లలో మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. చాలా రోజుల తర్వాత వీటిని తయారు చేస్తున్నారు అక్కడి దుకాణదారులు. అయితే కొందరు మాత్రం కస్టమర్లను లోనికి రానివ్వడం లేదు. సామాజిక దూరం పాటించే విషయంలో కఠిన ఆంక్షలు ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలో సేవలను పాక్షికంగా అందిస్తున్నారు.

పుంజుకున్న తయారీ రంగం!

వుహాన్​లో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ.. దాని ప్రభావం తగ్గినట్లు కాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. కరోనా తీవ్రత తగ్గిందని స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని పేర్కొన్నారు.

కరోనా ఆంక్షలు సడలించిన నేపథ్యంలో తయారీ రంగం కోలుకుంటోంది. మార్చిలో ప్రైవేటు రంగం పుంజుకున్నట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రైవేట్ రంగ ఆర్థిక సూచీ అయిన కొనుగోలు సూచీ.. ఫిబ్రవరిలో 35.7 పాయింట్ల కనిష్ఠ స్థాయి నమోదు చేయగా.. మార్చిలో అది 52 పాయింట్లకు వృద్ధి చెందినట్లు చైనా గణాంక సంస్థ ప్రకటించింది. అయితే ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కోలుకోలేదని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ మరిన్ని అవరోధాలు ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి:నిజాముద్దీన్​కు 2,100 మంది విదేశీయులు- వారి నుంచే కరోనా!

ABOUT THE AUTHOR

...view details