వుహాన్..కరోనా వైరస్ పుట్టినిల్లు. అడుగు బయటపెట్టాలంటేనే అక్కడి ప్రజలు గజగజ వణికిపోయారు. రెండున్నర నెలల లాక్డౌన్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోజూ వేలకొద్దీ కేసులు.. వందలాది మరణాలు. అయితే.. ఇది గతం. ఇప్పుడక్కడ వైరస్ దాదాపు నశించినట్లే కనిపిస్తోంది. కొత్త కేసులు రెండంకెలు దాటట్లేదు. మరణాలూ పెద్దగా నమోదుకావట్లేదు. కొత్తగా లక్షణాలు లేని కేసులు వెలుగుచూస్తున్నా .. అదీ తక్కువే.
ఈ నేపథ్యంలోనే నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా.. వుహాన్‌లోని పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి.
ఆంక్షల సడలింపుతో తెరుచుకున్న స్కూళ్లు! 121 ఉన్నత, వొకేషనల్ పాఠశాలలు బుధవారం తిరిగి తెరుచుకున్నట్లు చైనా అధికారిక మీడియా ధ్రువీకరించింది. గ్రాడ్యుయేట్ల కోసం.. మొదటి దశలో ఎంపిక చేసిన 83 సీనియర్ మిడిల్ స్కూళ్లు, 38 సెకండరీ వొకేషనల్ పాఠశాలలు తెరిచామని వుహాన్ ప్రభుత్వం ప్రకటించింది. ముందు జాగ్రత్తగా విద్యా సంస్థల్లో వైరస్ వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టినట్లు స్పష్టం చేశారు అధికారులు. విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి వైద్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
కొద్ది రోజుల కిందటే.. వుహాన్‌లో లాక్డౌన్ ఎత్తివేసింది చైనా ప్రభుత్వం. అన్ని కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. క్రమక్రమంగా దుకాణ, వాణిజ్య సముదాయాలు తిరిగి తెరుచుకుంటున్నాయి.