కరోనా వైరస్ పుట్టినిల్లు అయిన వుహాన్‌లో చైనా ఓ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నగరంలో నివసిస్తున్న మొత్తం 1.1 కోట్ల మంది ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు స్థానిక మీడియా కథనం ప్రచురించింది. దీనికి సంబంధించి '10 రోజుల యుద్ధం' అనే పేరుతో అంతర్జాలంలో ఒక డాక్యుమెంట్ విస్తృతంగా చక్కర్లు కొడుతున్నట్లు పేర్కొంది.
వుహాన్‌లోని ప్రతి జిల్లా అధికారులు 10 రోజుల ప్రణాళిక తయారు చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సదరు వార్తా సంస్థ వెల్లడించింది. కరోనా ప్రభావం ఉన్నా, లేకున్నా.. జిల్లాలోని జనాభాను బట్టి సొంతంగా ప్రణాళిక రూపొందించాలని ఆదేశాలు జారీ అయినట్లు పేర్కొంది. ఈ పరీక్షల్లో భాగంగా అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు సహా వృద్ధులకు తొలుత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది.
ఆచరణ సాధ్యం కాదు
మరోవైపు ఈ విషయంపై చైనా వైద్య శాఖ సీనియర్ అధికారులు స్పందించారు. నగరంలోని ప్రజలందరికీ పరీక్షలు నిర్వహించడం ఆచరణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఇందుకు భారీగా వ్యయం అవుతుందని పేర్కొన్నారు.