జనవరిలో చైనాలో నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ సామూహిక విందు వైరస్ వ్యాప్తిని వేగవంతం చేసిందని సీఎన్‌ఎన్ ప్రతినిధి ఫరీద్ జకారియా నిర్వహించిన పరిశోధనలో తేలింది. జనవరి 19న వుహాన్‌లోని 'ది బైబుటింగ్' అనే కమ్యూనిటీలో అతిపెద్ద 'పాట్‌లక్' విందు నిర్వహించారు. దాదాపు 40 వేల కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి. అప్పటికే వైరస్ వుహాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించింది. అయినా.. ప్రపంచ రికార్డు కోసం స్థానిక అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేయకుండా కొనసాగించారు.
57 భవనాలకుగాను 33 చోట్ల వైరస్.!
ఈ విందు ముగిసిన తర్వాత ఆ ప్రాంతంలో కరోనావైరస్ వేగంగా విజృంభించింది. ఆ ప్రదేశంలో 57 భవనాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కో భవనంలో 14 కుటుంబాలు ఉంటున్నాయి. దాదాపు 15 రోజుల్లోపే అక్కడ 33 భవనాల్లో కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిని ‘ఫీవర్ బిల్డింగ్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. ఈ ప్రదేశంలో మొత్తం 1,30,000 మంది ఉంటున్నారు. పొరుగు కమ్యూనిటీవారు వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని విందు రద్దు చేయాలని కోరారు. కానీ, అక్కడి జిల్లా అధికారులు మాత్రం మొండిగా దీనిని కొనసాగించారు. ఈ పార్టీ నిర్వహించిన రోజే దేశంలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు వుహాన్ చేరుకొన్నారు. జనవరి 23 నాటికి పరిస్థితి చేజారుతుందని వారికి అర్థమైపోయింది. వెంటనే వుహాన్ పట్టణంలో లాక్‌డౌన్ విధించారు. కానీ అప్పటికే వుహాన్ నుంచి లక్షల మంది దేశ సరిహద్దులు దాటేశారు. వారిలో ఈ పార్టీలో పాల్గొన్నవారెందరో లెక్కతెలియదు.