కరోనా బాధితులకు చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను భారత్ తమకు ఎగుమతి చేయకుంటే ఆ నిర్ణయం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని వ్యాఖ్యానించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్‌తో అమెరికాకు మంచి సంబంధాలున్నాయని.. సానుకూల సమాధానమే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ పాతకాలపు, చౌకైన ఔషధం. మలేరియా చికిత్సకు వినియోగించే ఈ మాత్రల్ని.. ప్రస్తుతం ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా నివారణకు ఆచరణీయ పరిష్కారంగా పేర్కొన్నారు ట్రంప్. కొవిడ్-19 రోగులకు ఇతర ఔషధాలతో కలిపి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను కూడా ఇవ్వాలని అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సూచించింది. అమెరికా ఇప్పటికే 29 మిలియన్ డోసుల మేర హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను నిల్వచేసి పెట్టుకుందని స్వయంగా వెల్లడించారు ట్రంప్.
''ఒకవేళ ఔషధాల్ని సరఫరా చేయొద్దన్నదే ఆయన(మోదీ) నిర్ణయమైతే.. అది నన్ను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆదివారం ఆయనతో మాట్లాడాను. క్లోరోక్విన్ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు. ఎందుకు ఉండకూడదు?''
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
కరోనా పరిస్థితులపై ఇరుదేశాధినేతలు ఆదివారం ఫోన్లో సంభాషించారు. కొవిడ్-19 చికిత్స కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయాలని భారత్‌ను కోరారు ట్రంప్.