తెలంగాణ

telangana

ప్రపంచంలోనే అతి సన్నటి నది ఇది.. వెడల్పు 4 సెంటీమీటర్లే!

By

Published : Jan 25, 2022, 12:23 PM IST

Worlds narrowest river: ప్రపంచంలో అతిపెద్ద నది ఏది అని అడిగితే ఠక్కున అమెజాన్ అని చెప్పేస్తాం. మరి ప్రపంచంలోనే ఇరుకైన నది ఏదంటే.. సమాధానం చెప్పడం కష్టమే. అదెక్కడుందో, దాని పొడవెంతో తెలుసా?

worlds narrowest river
worlds narrowest river

Worlds narrowest river: ఆ నదిని చూస్తే ఏ పిల్ల కాలువో అనుకుంటారు. పొలాల్లో నీటిని మళ్లించేందుకు నిర్మించిన మార్గంలా ఉంటుంది. కానీ అది ప్రపంచంలోనే అతి సన్నటి నది. దాని పేరు హులాయి. చైనాలోని మంగోలియాలో ఉందీ నది. ఈ నది వెడల్పు కొన్ని సెంటీమీటర్లే. కొన్ని ప్రాంతాల్లో ఈ నదిపై నుంచి ఒకే ఉదుటన దాటొచ్చు కూడా.

హులాయి నదిపై ఓ వ్యక్తి

Hualai River China

మంగోలియా పీఠభూమిపై ఉన్న హులాయి నది పొడవు 17 కిలోమీటర్లు. సగటు వెడల్పు మాత్రం 15 సెంటీమీటర్లే. ఓ చోట ఈ నది వెడల్పు కేవలం నాలుగు సెంటీమీటర్లే ఉంటుంది. పిల్ల కాలువను తలపించే ఇలాంటి నది ఒకటి ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు కదా! కానీ, చైనా నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఈ నది గత 10 వేల ఏళ్లుగా ప్రవహిస్తూనే ఉంది. భూగర్భ నీటి బుడగ నుంచి ఈ నది ప్రవాహం ప్రారంభమై.. హెగ్జిగ్టెన్​ గ్రాస్​లాండ్​లోని దలాయ్ నూర్ సరస్సులో కలుస్తుంది.

నదిలో నీరు తాగుతున్న జంతువులు

Smallest river news

ప్రపంచంలో అతిపెద్ద నదిగా అమెజాన్​కు పేరుంది. ఈ నది వెడల్పు ఎండాకాలంలో ఆరు మైళ్లు(9.6 కిలోమీటర్లు)గా ఉంటుంది. అదే వర్షకాలమైతే ఈ నది వెడల్పు కొన్ని చోట్ల 24 మైళ్లు(38.6 కిలోమీటర్లు) విస్తరించి ఉంటుంది. ఇతర సాధారణ నదుల వెడల్పు సుమారుగా ఒక కిలోమీటర్ల మేర ఉంటుంది.

హులాయి నది

నదికి ఉండే లక్షణాలన్నీ..

'హులాయి'ని నదిగా పరిగణించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, నీటి ప్రవాహాన్ని నదిగా పరిగణించడానికి దాని సైజుతో సంబంధం లేదన్నది కొందరి వాదన. ఓ నదికి ఉండే లక్షణాలన్నీ హులాయికి ఉండటం విశేషం. సంవత్సరాంతం ఈ నదిలో నీరు ప్రవహిస్తుంటుంది. ఓ నదికి ఉన్నట్టే స్పష్టమైన పరివాహక ప్రాంతం, పచ్చిక బయళ్లు దీనికీ ఉన్నాయి.

హులాయి నది

చైనా పురాతన కథల్లోనూ...

Book Bridge River: ఈ నదిని 'బుక్ బ్రిడ్జ్ రివర్' అని కూడా పిలుస్తారు. చైనా జానపద కథల నుంచి ఈ పేరు వచ్చింది. ఈ కథల ప్రకారం.. ఓ పిల్లాడు నదిని దాటే సమయంలో తన పుస్తకాన్ని నదిపై పడేసుకున్నాడు. అది సరిగ్గా నదిపై వంతెనలా పడిపోయింది. చీమలు, ఇతర చిన్న చిన్న జీవులు ఆ పుస్తకం పై నుంచి నదిని దాటాయి. దీంతో దానికి ఆ పేరు అలా స్థిరపడిపోయింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:'ఆ పేలుడు శక్తి.. వందల రెట్ల హిరోషిమా అణుబాంబులకు సమానం'

ABOUT THE AUTHOR

...view details