ప్రాణాంతక కరోనాపై ఏమీ తెలియని స్థితి నుంచి.. వైరస్‌కు టీకా అభివృద్ధి చేసే స్థాయికి ఎదిగింది ప్రపంచం. కరోనా కేసులు, మరణాలను కట్టడిచేయడం నుంచి ఇప్పుడు తమ దృష్టిని వ్యాక్సిన్ పంపిణీపై పెడుతున్నాయి. ఇందులో బ్రిటన్ ముందువరుసలో ఉంది. దాదాపు 95శాతం ప్రభావవంతమైన ఫైజర్ టీకా పంపిణీకి అత్యవసర అనుమతులిచ్చి... రానున్న వారాల్లో ప్రజలకు అందించనుంది. మరికొన్ని దేశాలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఆ విశేషాలను ఓసారి చూద్దాం..
టర్కీ...
చైనా సంస్థ సినోవాక్ నుంచి 50 మిలియన్ డోసుల కరోనావాక్ టీకాను కొనుగోలు చేసేందుకు గతంలో ఒప్పందం కుదుర్చుకుంది టర్కీ. తాజాగా ఈ 'ఇనాక్టివ్ టీకా'ను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు ఆ దేశ ఆరోగ్యమంత్రి ఫహ్రెట్టిన్ కోకా. ఈ నెల 11న ఈ టీకా దేశానికి చేరుతుందని.. దాని భద్రతపై టర్కీ ల్యాబ్‌లు నివేదించిన అనంతరం అత్యవసర అనుమతులు జారీ చేస్తామని వెల్లడించారు.
ల్యాబ్‌లో వైరస్‌ను అభివృద్ధి చేసి.. ఆ తర్వాత దానిని చంపే ప్రక్రియలో రూపొందించే టీకాను 'ఇనాక్టివ్ వ్యాక్సిన్' అంటారు. ఇది ప్రస్తుతం మూడో దశలో ఉంది.
ఇదీ చూడండి:-ఛలో బ్రిటన్: 'వ్యాక్సిన్ టూరిజం'కు క్రేజ్
పాకిస్థాన్..
తమ దేశ ప్రజలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. వ్యాక్సిన్ డోసులను కొనుగోలు చేసేందుకు కావాల్సిన నిధుల కోసం ప్రభుత్వం అనుమతులిచ్చినట్టు వివరించారు. చైనా వ్యాక్సిన్లు ఆశాజనకంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
ఆఫ్రికా..
ఆఫ్రికా ఖండంలోని 60శాతం మంది ప్రజలకు రానున్న రెండు-మూడేళ్లలో టీకా అందించాలని ఆఫ్రికా సీడీసీ(రోగ నివారణ- నియంత్రణ కేంద్రం) డైరెక్టర్ జాన్ కెన్గాసాంగ్ అభిప్రాయపడ్డారు.