కరోనా వైరస్ వ్యాక్సిను వినియోగించుకునేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ తమకు అనుమతిచ్చినట్లు ఇవాళ ప్రకటించింది చైనా. ఇప్పటికే మూడో దశ ప్రయోగాలు కొనసాగుతోన్న వ్యాక్సిన్‌ను.. ప్రజలకు ఇచ్చేందుకు డబ్ల్యూహెచ్‌ఓ మద్దతు తెలిపినట్లు చైనా ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు.
అత్యవసరంగా..
ప్రస్తుతం మూడోదశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతోన్న వ్యాక్సిన్‌ను అత్యవసర కార్యక్రమం కింద వేల మంది ప్రజలకు ఇస్తున్నారు. ముఖ్యంగా వైరస్ ప్రమాదం పొంచివున్న ఆరోగ్యకార్యకర్తలకు, ప్రజలకు ఈ టీకాలను వేస్తున్నారు. ఇందుకోసం జూన్ చివరివారంలోనే చైనా స్టేట్ కౌన్సిల్ దీనికి ఆమోదం తెలిపిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ అధికారి వెల్లడించారు. అయితే, ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు జూన్‌లోనే తెలియజేసినట్లు ఆయన స్పష్టంచేశారు. జూన్ 29న డబ్ల్యూహెచ్‌ఓను సంప్రదించగా వారు ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు పేర్కొన్నారు. అయితే, దీనిపై చైనాలోని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి మాత్రం స్పందించలేదు. అత్యవసర టీకా కార్యక్రమం గురించి ఇప్పటివరకు చైనా కూడా అధికారికంగా వెల్లడించలేదు.