తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​- పాక్ జల వివాదంపై ఏ నిర్ణయం తీసుకోలేం!' - భారత్ పాక్

భారత్​- పాకిస్థాన్​ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి తాము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు డాన్ పత్రిక తెలిపింది. సమస్యను తటస్థ నిపుణుడికి లేదా కోర్టు మధ్యవర్తిత్వానికి అప్పగించే విషయంలో ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించి ఏదో ఒక ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించినట్లు వివరించింది.

world bank says cannot mediate in Pakistan-India water dispute
'భారత్​-పాక్ జలవివాదంపై సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేం!'

By

Published : Aug 9, 2020, 6:50 AM IST

భారత్- పాక్​ల మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి తాము సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేమని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నట్లు పాకిస్థాన్‌కు చెందిన డాన్ పత్రిక శనివారం వెల్లడించింది. తటస్థ నిపుణుడికి లేదా కోర్టు మధ్యవర్తిత్వానికి ఈ సమస్యను అప్పగించే విషయంలో తన అశక్తతను అది వ్యక్తం చేసిందని తెలిపింది. ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించి ఏదో ఒక ఐచ్ఛికాన్ని ఎంపిక చేసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించినట్లు వివరించింది.

దాదాపు తొమ్మిదేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 1960లో భారత్, పాక్​లు ప్రపంచ బ్యాంకు సమక్షంలో జల ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు దేశాలు వాటి నదుల నీటి వినియోగ సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించాయి. కాలక్రమంలో ఈ ఒప్పందం విషయంలో దాయాది దేశాల మధ్య భేదాభిప్రాయాలతో పాటు ఒప్పంద ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయి.

రెండు జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల విషయంలో భారత్, పాక్ మధ్య వివాదం నెలకొంది. దీని పరిష్కారానికి స్వతంత్ర నిపుణుడిని నియమించాలని భారత్ కోరుతుండగా .. కోర్టు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించాలని పాక్ పట్టుబడుతోంది. 2015 సెప్టెంబర్​లో ప్రపంచబ్యాంకు ఆధ్వర్యంలో రెండు దేశాలు చివరిసారి కార్యదర్శి స్థాయిలో జల వివాదాలపై చర్చలు జరిపాయి. 2018 డిసెంబర్​లో చర్చల ప్రక్రియకు ప్రపంచ బ్యాంకు తాత్కాలిక విరామం ప్రకటించింది . ప్రపంచ బ్యాంకు దేశీయ డైరెక్టర్​గా ఇస్లామాబాద్​లో విధులు నిర్వహిస్తున్న పచ్చముత్తు ఇలాంగోవన్ తన ఐదేళ్ల పదవీ కాలం ముగిసిన సందర్భంగా జల వివాదాలపై తాజాగా ఐచ్ఛికాల ప్రస్తావన తీసుకువచ్చినట్లు డాన్ తెలిపింది .

ABOUT THE AUTHOR

...view details