ముష్కరుల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి వెళ్లాలని ప్రయత్నిస్తోన్న అఫ్గాన్ పౌరులపై తాలిబన్లు దాడులు చేస్తున్నారు. విమానాశ్రయం లోపలికి వెళ్లకుండా ఇనుపకంచెలు అడ్డుపెట్టారు. దీంతో నిస్సహాయస్థితిలో ఉన్న ప్రజలు సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. తమను కాపాడమంటూ ఎయిర్‌పోర్టులో ఉన్న యూఎస్, యూకే దళాలను వేడుకుంటున్నారు. కనీసం తమ తర్వాతి తరం వారినైనా రక్షించుకోవాలన్న ఆరాటంతో ఇనుప కంచెలపై నుంచి పిల్లలను లోపలికి విసిరేస్తోన్న తల్లులు ఎందరో..! ఆ హృదయ విదారక ఘటనలు చూస్తుంటే దుఖం పొంగుకొస్తోందని బ్రిటీష్ ఆర్మీ సీనియర్ అధికారి ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.
అఫ్గాన్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను వెనక్కి తీసుకొచ్చేందుకు అమెరికా, యూకే ప్రత్యేక బలగాలను పంపాయి. కాబుల్ విమానాశ్రయాన్ని ఆధీనంలోకి తీసుకొని వీరంతా పహారా కాస్తున్నారు. అయితే, తాలిబన్ల పాలనతో భయాందోళనకు గురైన అఫ్గాన్ వాసులు కూడా దేశం విడిచి పారిపోయేందుకు సోమవారం ఎయిర్‌పోర్టుకు పోటెత్తారు. దీంతో అక్కడ భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో విమానాశ్రయం వద్దకు తాలిబన్లు చేరుకుని అఫ్గాన్ వాసులను అడ్డుకున్నారు. గేట్లు మూసేసి ఇనుప కంచెలు అడ్డుపెట్టారు.