ఒక యుద్ధంలో ముందుగా బలయ్యేది నిజం. ఆ తరవాత వంతు మహిళలది. యుద్ధాలతో ఛిద్రమైన సిరియా, ఇరాక్, యెమెన్, అఫ్గానిస్థాన్‌లలో మహిళల పరిస్థితి ప్రస్తుతం ఇదే. ఆ దేశాల్లో మహిళల మనోభావాల్ని, స్థితిగతుల్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు. అయినప్పటికీ, కొంతమంది మహిళలు ధైర్యం చేసి భద్రత, స్వేచ్ఛ దిశగా సాగే మార్గాల్ని వెదుక్కుంటున్నారు. ఒకప్పుడు తాలిబన్ ఆధిపత్యంలో మగ్గిన ప్రాంతాల్లో ఇప్పుడు ఇలాంటి మార్పే కనిపిస్తోంది. అఫ్గానిస్థాన్‌లో కొన్ని ప్రావిన్సులు మినహా, మొత్తం దేశంలో ముఖ్యంగా పాకిస్థాన్‌తో సరిహద్దులు కలిగిన ప్రావిన్సుల్లో మహిళలు తమ ఆకాంక్షల్ని చంపుకొని ఆదిమ జీవనశైలిని పాటించడం కనిపిస్తుంటుంది. పశ్చిమాసియా దేశాల్లోని మహిళలదీ ఇలాంటి పరిస్థితే. ఈ ప్రాంతాల్లోని మహిళలు పురుషులతో సమానమైన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో కూడిన సంస్కృతిని ఇష్టపడినా, అధికారం చెలాయించిన పాలకులు అందుకు ససేమిరా అంగీకరించలేదు.
పాపభీతికి పలు కోణాలు...
చాలామంది మహిళలు తమలో గూడుకట్టుకున్న అవగాహన రాహిత్యం కారణంగా తాము అనుసరిస్తున్న విధానం తమ మతాచారంలో భాగమని భావిస్తారు. హక్కుల విషయంలోనూ ఇదే భావన గూడుకట్టుకుని ఉంటోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యే మహిళలు దశాబ్దాలుగా, శతాబ్దాలుగా జీవనం సాగించేస్తున్నారు. అక్కడి సమాజాల్లో భాగస్వామిని ఎంచుకునే విషయంలో పురుషులకు స్వేచ్ఛ ఉంది. అదే మహిళల విషయానికి వచ్చేసరికి తమ పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. పురుషులు తమలోని భావాలను స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. మహిళలు మాత్రం మనసులో మాటను తమలో తాము దిగమింగుకోవాల్సిందే. పాపభీతికి పలు కోణాలు, నిర్వచనాలు ఉన్నాయి. పురుషుడు పాపానికి పాల్పడితే చెల్లించుకోవాల్సిన మూల్యం విభిన్నంగా ఉంటోంది. అదే మహిళ విషయానికికొచ్చేసరికి అలవికానంతటి నష్టాన్ని భరించాల్సిందే.
పురుషస్వామ్య దాష్టీకం..
గత రెండు దశాబ్దాల కాలంగా అఫ్గానిస్థాన్ యుద్ధ పరిస్థితుల్లో చిక్కుకుని అతలాకుతలమైంది. తాలిబన్ పాలనలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం ఏదైనా పని చేసుకోవాలన్నా కష్టంగా ఉండేది. బాలబాలికలు కలిసి చదువుకోగల విద్యాసంస్థల్లోనూ అమ్మాయిలు విద్యాభ్యాసానికి వెళ్లడానికి వీల్లేని పరిస్థితి. వారి అభిప్రాయాల్ని, అనుభూతుల్ని అభివ్యక్తీకరించేందుకు వీలున్న ప్రతి అవకాశాన్నీ తొక్కిపెట్టేశారు. దీనికితోడు మహిళలు అపరిచితులకు చాలా దూరం పాటించాలి. స్త్రీల ముఖం, గొంతు కూడా అపరిచితులకు కనిపించకకూడదు, వినిపించకూడదన్నట్లు ఆంక్షలు విధించారు. అరబ్ ప్రపంచంలో ముస్లిం మహిళలదీ దాదాపు ఇలాంటి పరిస్థితే. అత్యవసర పరిస్థితుల్లో సైతం మహిళలు తమ కుటుంబ సభ్యులను తీసుకొని బయటికి వెళ్లడానికి వీల్లేదు. ఇలాంటి అణచివేతల నుంచి బయటపడే దిశగా భారీ మార్పులు తప్పనిసరిగా రావాల్సిందే.
అనేక దశాబ్దాలుగా ఈ ప్రాంతాల్లోని మహిళల్ని చీకట్లో మగ్గిపోయేలా చేసిన బంధనాలను బద్దలు కొట్టేలా చేయడంలో ఆధునిక సాహిత్యం ద్వారా అందివచ్చిన వ్యక్తివాద ఆలోచన, సాంస్కృతిక ఇస్లాంకు సంబంధించిన ఆధునిక వ్యాఖ్యానాలు ఎంతగానో తోడ్పడ్డాయి. మహిళల దీనమైన పరిస్థితులకు ప్రధాన కారణం... పితృస్వామిక దాష్టీక పద్ధతులే. అక్కడి మహిళలది ఎదురుతిరిగే మనస్తత్వం కాకపోవడం కూడా సమస్యకు కొంతమేర కారణంగా మారింది. పితృస్వామిక భావజాలంతో కూడిన, సమాచార వ్యాప్తిపై విధించిన పరిమితులు మార్పులు నిరోధకంగా మారాయి.